జిల్లావాసులు ఇంట్లోనే వినాయక చవితి చేసుకోవాలి..కలెక్టర్


Ens Balu
2
Visakhapatnam
2020-08-20 18:09:18

 వినాయక చవితి పూజలు ఇంటిలోనే నిర్వహించుకోవాలని   జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.  కరోనా వ్యాప్తి దృష్ట్యా వీధుల్లో వినాయక చవితి సంబరాలు ఏర్పాటు చేయరాదని ఆయన స్పష్టం చేసారు.  వినాయక ప్రతిమలు ఏర్పాటు చేసి నవరాత్రులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టరాదని ఆయన పేర్కొన్నారు. ఇంటిలోనే పూజలు నిర్వహించుకోవాలని ఆయన స్పష్టం చేసారు. వీధుల్లో సంబరాలు చేస్తే కరోనా వైరస్ వ్యాప్తికి కారణం కాగలరని, ఎపిడమిక్ చట్టం క్రింద చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.  దీనిని ప్రజలు గమనించి సాంప్రదాయ బద్ధంగా కుటుంబం యావత్తు ఇంటిలోనే ప్రశాంతంగా పూజలు నిర్వహించుకుని భగవంతుని ఆశిస్సులు పొందాలని సూచించారు.  అపార్టుమెంట్లు మరియు నివాస గృహాలలో ఏర్పాటుచేయు గణపతి విగ్రహములు 3 అడుగులు మించి ఉండరాదు. అట్లే వారి నివాస ప్రాంగణంలోనే సదరు ఉత్సవములు జరుపుకొనవలెను.    ఆలయాల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకొనవలెను.  అట్లే తీర్థ ప్రసాదములు పంచరాదు. ఏవిధమైన సాంస్కృతిక కార్యక్రమాలు  నిర్వహించరాదు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ వైరస్ వ్యాప్తి కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.   వినాయక మండపాలకు అనుమతి లేదు.   వినాయక చవితి సందర్భంగా వీధులు, బజార్లలో ఏర్పాటు చేసే వినాయక మండపాలకు అనుమతి లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని ఆయన కోరారు.   వినాయకచవితిరోజు కాని, నిమజ్జనం రోజు కాని ఊరేగింపులు జరపడం, భక్తులు గుమిగూడి సమూహంగా నిమజ్జనం చేయడం వంటి కార్యక్రమాలకు అనుమతి లేదు. పై సూచనల పై గ్రామ/ మండల/ డివిజన్/ మున్సిపల్/  కార్పొరేషన్ పరిధిలో  ఆయా శాఖల అధికారులు విధిగా గణపతి నవరాత్రుల ఉత్సవ కమిటీలను పిలిచి సమావేశం ఏర్పాటుచేసి  కోవిడ్ మహమ్మారి కారణంగా నిభందనలు పాటించేలా అన్ని సూచనలు తెలియజేయాలన్నారు.