రాష్ట్రంలో జెండర్ బడ్జెట్ విధానం..
Ens Balu
2
శ్రీకాకుళం
2021-03-08 13:39:59
మహిళా అంటే ఆకాశంలో సగభాగం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సృష్టి కారకులు మహిళలు అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను నిర్వహించారు. ఈ కార్యక్రమంను లైవ్ కార్యక్రమంగా నిర్వహించి జిల్లాల్లో ప్రసారం చేసారు. జిల్లాల్లో వివిధ రంగాలకు చెందిన మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. కుటుంబం బాగు పడాలి అనే ఆలోచన అక్కాచెల్లెమ్మలలో ఉంటుందని సియం అన్నారు. భూదేవి అంతటి సహనం అక్కాచెల్లెమ్మలలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల్లో అక్షరాస్యత 60 శాతం మాత్రమేనని తెలిపారు. సామాజిక వివక్షకు గురికావడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ అంశాల్లో మార్పులు తీసుకు రావాలని అనేక పథకాలు తీసుకువచ్చామని అన్నారు. ఆడపిల్లలు అందరూ బడిబాట పట్టాలని, పేదరికంతో చదువుకు దూరం కారాదని అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశ పెట్టామని ఆయన తెలిపారు. రూ.32,500 కోట్లను అమ్మ ఒడి పథకం క్రింద తల్లులకు పంపిణీ చేశామని చెప్పారు. రూ. 80 వేల కోట్లకు పైగా మహిళలకు ఆర్ధిక సహాయాన్ని అందించామని పేర్కొన్నారు. రూ.1863 కోట్లను పౌష్టికాహారం కోసం ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అక్కాచెల్లెమ్మలు ఆర్ధిక స్వావలంబన సాధించాలని ప్రయత్నం చేస్తున్నామని సియం చెప్పారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ రంగాల్లో అభివృద్ధికి చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. మహిళపై నేరాలు తగ్గించగలిగామని, మహిళా రక్షణకు రాష్ట్రంలో 18 దిశా పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 9 వందల ద్విచక్ర వాహనాలను దిశ పర్యవేక్షణలో భాగంగా కొనుగోలు చేశామని, పోలీసు స్టేషన్లలో మహిళా సహాయక డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళా సహాయక కీయాస్క్ లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. మహిళా ఉద్యోగులకు సాధారణ సెలవులు 20 రోజులకు పెంపు చేస్తున్నామని ఆయన చెప్పారు. జూలై 1 నుండి సానిటరీ నేప్కిన్స్ అందిస్తామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో జెండర్ బడ్జెట్ విధానం ఈ ఏడాది బడ్జెట్ నుండి తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కార్యాలయాల్లో లింగ వివక్ష నివారణకు కమిటీలు కచ్చితంగా ఏర్పాటు కావాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.జయదేవి, పిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.