స్పందన వినతులకు తక్షణ పరిష్కారం..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-03-08 13:44:01
స్పందన కార్యక్రమానికి పలు వినతులు అందాయి. డయల్ యువర్ ఫోన్ ద్వారా స్పందన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ఫోన్ కాలర్స్ ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేసారు. పొందూరు నుండి యస్.రామారావు ఫోన్ చేసి మాట్లాడుతూ విద్యార్ధుల సౌకర్యార్ధం పొందూరు నుండి శ్రీకాకుళంకు ఆర్.టి.సి బస్సులను ఏర్పాటుచేయాలని కోరారు. పలాస పట్టణంలోని 14వ వార్డు నుండి యస్.ప్రభ ఫోన్ చేస్తూ తమ పిల్లలకు ఉపకార వేతనాలను మంజూరుచేయడంలేదని ఫిర్యాదు చేసారు. బూర్జ మండలం కోటవాడ నుండి డి.కిశోర్ కుమార్ మాట్లాడుతూ తమ తాత గారికి చెందిన భూములను వేరే పేరుతో విక్రయాలు జరిపారని, కావున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. పోలాకి మండలం అంబీరుపేట నుండి యస్.రామకృష్ణ ఫోన్ చేసి మాట్లాడుతూ తమ తండ్రి గారు మరణించి 7 నెలలు అయిందని, తమ కుటుంబానికి ఎటువంటి ఆధారం లేనందున తన తల్లి పొదుపు సంఘం నుండి ఆర్ధిక సహాయాన్ని మంజూరుచేయాలని కోరారు. జలుమూరు మండలం శ్రీముఖలింగం నుండి నాయుడుగారి రాజశేఖర్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రేవుల వద్ద స్నానాలు ఉంటాయని, కాని రేవులు తుప్పలతో ఉన్నందున వాటిని శుభ్రపరచాలని కోరారు. సారవకోట మండలం బుడితి నుండి వి.వెంకటరమణ మాట్లాడుతూ దేవాంగుల వీధికి సిసి రోడ్డు మంజూరుచేయాలని కోరారు. నందిగాం నుండి జె.రమేష్ మాట్లాడుతూ తమ గ్రామంలో ధాన్యం మిల్లు లేక ధాన్యం అలాగే ఉండిపోయాయని, కావున తమ ధాన్యాన్ని వేగంగా ఆడించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. కంచిలి మండలం మర్తూరు నుండి యం.చిన్నయ్య ఫోన్ చేస్తూ తమకు ప్రభుత్వ లెక్కల ప్రకారం భూమి ఎక్కువగా ఉన్నట్లు డేటా ఉన్నందున రేషన్ నిలిపివేసారని, మరలా పునరుద్దరించాలని కోరారు. కోటబొమ్మాళి మండలం నూకపేట నుండి యన్.వెంకటేషన్ మాట్లాడుతూ పింఛను కొరకు దరఖాస్తు చేసి రెండేళ్లు అయినప్పటికీ ఇంతవరకు మంజూరుచేయలేదని ఫిర్యాదు చేసారు. హిరమండలం నుండి యం.రమేష్ మాట్లాడుతూ తనకు ఇంటిస్థలాన్ని మంజూరుచేయాలని కోరారు. మెళియాపుట్టి మండలం కొసమాల నుండి యస్.గంగాధరరావు మాట్లాడుతూ అమ్మఒడి పథకం ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరైందని, దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వంగర మండలం కొనిగపాడు నుండి బి.లక్ష్మీనాయుడు మాట్లాడుతూ వాహన మిత్ర నగదు తన ఖాతాలో పడలేదని ఫిర్యాదు చేసారు. ఈ కార్యక్రమంలో స్పందన విభాగం పర్యవేక్షకులు, పర్యవేక్షణ అధికారి భాస్కరరావు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.