మహిళా వివక్ష నిర్మూలనకు ముందుకి రావాలి..


Ens Balu
3
Anantapur
2021-03-08 13:46:43

మహిళా వివక్షత నిర్మూళనకు ప్రతీ ఒక్కరూ ముందుకి రావాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. సోమవారం  కలెక్టరేట్ ఆవరణంలోని రెవెన్యూ భవన్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా  సఫాయి కర్మచారీ మహిళలు, మహిళా అధికారులు మరియు ఇతర మహిళలకు జిల్లా కలెక్టర్  సన్మానించారు. వేడుకలలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు లేకపోతే మనమెవరమూ లేమన్నారు. చరిత్రలో ఎన్నో కట్టుబాట్లు దాటుకుని మహిళలు ఈరోజు హక్కులు, అవకాశాలు సంపాదించుకున్నారన్నారు. సతీసహగమనం, బాల్య వివాహాలు, విద్యకు దూరంగా ఉంచడం, బయటి ప్రపంచానికి కనిపించకుండా చేయడం వంటి ఎన్నో కట్టుబాట్లు ఒకప్పుడు ఉండేవని.. ఈనాటికీ ఇంట్లో ఆడపిల్లలను ఒకలా, మగ పిల్లల్ని ఒకలా చూసే అలవాటు చూడటం తల్లిదండ్రుల్లో కనిపిస్తోందన్నారు. ఆ వివక్ష, కట్టుబాట్లు నశించాలన్నారు. రెండు వందల ఏళ్ల క్రితం సావిత్రి బాయ్ ఫులే అనే మహిళ ఆనాటి కట్టుబాట్లను కాదని తాను చదువు కోవడమే గాక దేశంలోనే మొట్టమొదటి బాలికల పాఠశాల స్థాపించిందన్నారు. ప్రతి మహిళా ఓ సావిత్రి బాయ్ ఫులే కావాలని ఆకాంక్షించారు. ఈ సామాజిక కట్టుబాట్లనుంచి బయటికి వచ్చే మహిళలకు అండగా ఉండటంలో జిల్లా యంత్రాంగం ముందువరుసలో ఉంటుందన్నారు. బాలికే భవిష్యత్తు వంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేపట్టి బాలికలు, మహిళల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, ఎంత చేసినా అది తక్కువేనన్నారు.   మహిళను అయినందుకు గర్విస్తున్నా: జేసీ సిరి  జాయిట్ కలెక్టర్ ఏ.సిరి(అభివృద్ధి) మాట్లాడుతూ మహిళగా పుట్టినందుకు గర్విస్తున్నానన్నారు. పిల్లలని కని, పెంచి వారికి ఒక మంచి భవిష్యత్తును అందించడంలో మహిళల పాత్రే కీలకమన్నారు. ఆధునిక మహిళలు వృత్తి, ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు   కుటుంబానికి, వృత్తికి సమతుల్యత పాటించడానికి మించిన సవాలు మరొకటి ఉండదన్నారు. కూతురిగా, భార్యగా, తల్లిగా, అమ్మమ్మగా, నాన్నమ్మగా ఎన్నో పాత్రలను మహిళ సమర్థవంతంగా పోషిస్తోందన్నారు.మన తల్లులు మన పిల్లల్ని చూసుకుంటూ మనకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని,  నా విజయానికి కారణం మా అమ్మ అని చెప్పారు.. ఉద్యోగం చేస్తున్న మహిళలు ఒక వైపు వృత్తి ధర్మం నిర్వహిస్తూనే,  బిడ్డకు జన్మనిస్తూ, వారి ఆరోగ్యం, వారి చదువు, వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారని ఆమె గుర్తు చేసారు.  అన్నింటా మహిళలు ముందున్నారు: సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి  సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి మాట్లాడుతూ మహిళా దినోత్సవం మహిళలందరికీ పండగ రోజన్నారు.  మహిళలు తమ హక్కులకోసం చేసిన పోరాటం నుంచి మార్చి 8న మహిళా దినోత్సవం ఉద్భవించిందన్నారు. స్త్రీలు పురుషుల కంటే ఎందులోను తక్కువ కాదన్నారు. ప్రపంచంలోని అన్ని రంగాల్లో మహిళలు ముందు వరసలో ఉన్నారన్నారు. ఈరోజు ఆటో నడపడం దగ్గర్నుంచి అంతరిక్షంలో కాలు మోపే వరకూ అన్ని చోట్లా స్త్రీలు సత్తా చాటుతున్నారన్నారు. మహిళ పాత్ర తన వ్యక్తిగత విజయాలకు పరిమితం కాదన్నారు. పురుషులను మంచి మార్గంలో నడిపించడం, వెన్ను తడుతూ వారి విజయానికి తోడ్పాటు అందించడంలో మహిళల పాత్ర వెలకట్టలేనిదన్నారు. అలాంటి మహిళలను గౌరవించుకోవాలన్నారు. స్త్రీల మీద జరుగుతున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. అన్ని వర్గాల మహిళలకు సన్మానం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకి కృతజ్ఞతలు తెలిపారు.  వేడుకలలో సఫాయి కర్మచారులు నారాయణమ్మ, నాగమణి, మంగమ్మ లను కలెక్టర్ సన్మానించారు. అనంతరం జిల్లా మహిళా అధికారులు, అంగన్వాడీ వర్కర్లు, కోవిడ్ సమయంలో విశేషంగా సేవలందించిన పలువురు మహిళా ఉద్యోగులను కలెక్టర్ సన్మానించారు.  కలెక్టర్ సన్మానించిన వారిలో జాయింట్ కలెక్టర్ ఏ.సిరి(అభివృద్ధి), సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ నల్లాని రాజేశ్వరి, ఆర్డీటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్, రెడ్స్ సంస్థ భానుజ, ఐసిడిఎస్ పీడీ విజయలక్ష్మి, డిపిఓ పార్వతి, హార్టికల్చర్ డిడి పద్మలత,అగ్రికల్చర్ ఏ డి విద్యావతి, ఒకరోజు కలెక్టర్ శ్రావణి, కిలిమాంజారో పర్వతాన్ని అధిరోహించిన రిత్విక శ్రీ, పలువురు జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.  కార్యక్రమంలో ఐసిడిఎస్ సీడీపీవోలు శ్రీదేవి ,లలిత తదితరులు, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు..