జీతాల ఖాతాగా నమోదు చేయించుకోవాలి..


Ens Balu
4
Srikakulam
2021-03-08 14:20:36

ప్రభుత్వ ఉద్యోగులు తమ బ్యాంకు ఖాతాలను జీతాల ఖాతాగా నమోదుచేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్.బి.ఐ) తమ పథకాల ప్రదర్శన, అవగాహన కార్యక్రమాన్ని సోమ వారం ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు అనుసంధానంతో అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ప్రధామంత్రి ఆవాస్ యోజన (పి.ఎం.ఏ.వై) అటాల్ పెన్షన్ యోజన( ఏ.పి.వై), ఎస్.పి.ఎస్.వై తదితర పథకాలు ప్రజలకు మంచి ఉపయోగకరమని పేర్కొన్నారు. ఉద్యోగులు బ్యాంకు ఖాతాలను సాధారణ ఖాతాలుగానే వినియోగించడం జరుగుతుందని, దానిని జీతాల ఖాతా (శాలరీ అకౌంట్)గా నమోదు చేసుకోవడం వలన ప్రమాద బీమా రూ.20 లక్షల వరకు వర్తిస్తుందని అన్నారు. ప్రతి ఉద్యోగి దీని పట్ల శ్రద్ద వహించాలని కోరారు. ఎస్.బి.ఐలో ఖాతాలు కలిగి ఉన్న ఉద్యోగులకు జీతాల ఖాతాగా నమోదుకు చర్యలు చేపట్టాలని జిల్లా రెవిన్యూ అధికారికి, ఎస్.బి.ఐ అధికారులకు సూచించారు.  ఎస్.బి.ఐ రీజనల్ మేనేజర్ తపోదన్ దెహీరి మాట్లాడుతూ బ్యాంకు పూర్తి స్ధాయిలో డిజిటలైజేషన్ అయిందని, డిజిటలైజేషన్ సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. ఎస్.బి.ఐ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఎస్.బి.ఐ గృహ, వాహన, వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, ఎస్.బి.ఐ అధికారులు కామేశ్వర రావు, వి.ఎస్.ఎన్ సాహూ, వెంకట రమణ, కిరణ్ బాబు, గణేష్, సత్యప్రియ, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.