శ్రీముఖలింగం శివరాత్రి దర్శనాలు స్థానికులకే


Ens Balu
2
Mukhalingam
2021-03-08 16:06:58

శ్రీముఖలింగంలో నిర్వహించే శివరాత్రి మహోత్సవ లకు స్థానికులకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ జె నివాస్ తెలిపారు. బయటి నుంచి వచ్చే భక్తులకు అనుమతి ఉండదని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసారు. కోవిడ్ రెండవ దశ వ్యాప్తిలో ఉన్నందున ఉత్సవాలు నిర్వహించుటకు, ఎక్కువ మంది గుమిగూడుటకు అనుమతించడం లేదని సోమవారం ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులు 216, ఏపిడమిక్ చట్టం కింద మతపరమైన వేడుకలు భారీ ఎత్తున చేయుట, ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీముఖలింగంలో జరిగే శివరాత్రి మహోత్సవాలు శ్రీముఖలింగం మరియు శ్రీముఖలింగాయానికి అతి సమీపంలో ఉండే  గ్రామాల ప్రజలకు మాత్రమే 11వ తేదీన దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  సంబంధిత తహశీల్దార్లు, పోలీసు సిబ్బంది తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.   అన్నిచోట్ల కోవిడ్ నియమ నిబంధనలు విధిగా పాటించాలని ఆయన స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే చుట్టు పక్కల గ్రామాల భక్తులు సైతం మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ ఉపయోగించాలని ఆదేశించారు.  ప్రజలకు లౌడ్ స్పీకర్ల ద్వారా తగిన అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ఎక్కువ మంది ఎక్కడా గుమిగూడటానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఏ వ్యక్తి అయినా కరోనా లక్షణాలతో ఉన్నట్లు గుర్తిస్తే తక్షణం అతన్ని  పరీక్షలకు పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  హాస్టల్లోను,  రెస్టారెంట్లు ఇతర ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనల అమలు తీరును తహశీల్దార్లు నిశితంగా తనిఖీ చేయాలని  ఆయన పేర్కొన్నారు.  టెక్కలి సబ్ కలెక్టర్, పాలకొండ ఆర్డిఓ పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.  నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు విపత్తుల చట్టం, ఐపిసి 188 సెక్షన్ కింద శిక్షార్హులు అవుతారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్ నియంత్రణలో ఉండుటకు జిల్లా ప్రజలు సహకరించారని పేర్కొంటూ, రానున్న కొద్ది రోజుల పాటు సహకారాన్ని అందించి కోవిడ్ నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. కోవిడ్ టీకా ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.