మహిళా అధికారుల జిల్లా తూగోజికి స్థానం..
Ens Balu
3
Kakinada
2021-03-08 16:10:11
కుటుంబ సక్రమ నిర్వహణతో పాటు ఉద్యోగ జీవితంలో పనిచేసే తీరు.. ఆలోచనా విధానంలో పురుషులతో పోల్చితే మహిళలు ఒక మెట్టు పైనే ఉంటున్నారని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. జేసీ (అభివృద్ధి) కీర్తి చేకూరి, జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజలి తదితరులతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళా ఉద్యోగులను ఉద్దేశించి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి మాట్లాడారు. అత్యధిక జనాభా.. జనసాంద్రత.. సామాజిక, ఆర్థిక సవాళ్లు.. అయినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొంటూ తూర్పుగోదావరి జిల్లాను ప్రగతిపథంలో నడిపించడంలో కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఉన్న మహిళా అధికారులు, సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ విభాగాల కీలక స్థానాల్లో మహిళలు ఉన్నారని, ఇద్దరు జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్, ట్రెయినీ కలెక్టర్ అందరూ మహిళామణులేనని వివరించారు. కోవిడ్-19 క్లిష్ట సమయంలో బాధితులకు సొంత కుటుంబ సభ్యులే దూరంగా ఉన్న పరిస్థితుల్లో జేసీలు కీర్తి చేకూరి, జి.రాజకుమారి విధి నిర్వహణలో చూపిన చొరవ మరువలేనిదని, వారిద్దరికీ జిల్లాలోని దాదాపు 56 లక్షల మంది ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు. వీరితో పాటు ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ రూంలు, వలస కార్మికుల కేంద్రాలు.. ఇలా వివిధ చోట్ల అంకితభావంతో కోవిడ్ విధులు నిర్వర్తించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణ సమయంలో కొందరికి కోవిడ్ సోకినా భయపడకుండా ముందడుగు వేశారన్నారు. జిల్లాలో ఎంతో నిబద్ధతతో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, సిబ్బంది ఉండటం నిజంగా అదృష్టమని కలెక్టర్ పేర్కొన్నారు.
కలల్ని కనే ధైర్యం ఉండాలి: జేసీ(డీ) కీర్తి చేకూరి
ఇంటి నుంచి బయటకు రావడమే సాధికారత కాదని.. ధైర్యంగా కలలు కని, వాటిని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయాలని జేసీ (డీ) కీర్తి చేకూరి పేర్కొన్నారు. సంకుచిత మనస్తత్వం నుంచి బయటపడి విశాల దృక్పథాన్ని పెంపొందించుకొని ఎదిగినప్పుడే నిజమైన సాధికారత సొంతమవుతుందన్నారు. మన ముందు తరాల మహిళలు చేసిన కృషివల్లే మనం ఈరోజు ఇక్కడ ఉన్నామని వ్యాఖ్యానించారు. ప్రతి మహిళా మార్పు దిశగా ముందడుగు వేయాలని సూచించారు. జిల్లాలో ప్రతి విభాగంలోనూ మహిళా అధికారులు, సిబ్బంది ఉన్నారని.. నిర్దేశ సమయంలో పనిపూర్తిచేయడంలో వారి పాత్ర కీలకమైందని ప్రశంసించారు. జాయింట్ కలెక్టర్‌గా తాను ప్రస్తుతం ఈ స్థానంలో ఉండటానికి తన తల్లిగారు కారణమని పేర్కొన్నారు.
చేసే ప్రతి పనినీ ఆస్వాదించాలి: జేసీ(డబ్ల్యూ) జి.రాజకుమారి
ఏ పని అప్పగించినా విజయవంతంగా పూర్తిచేస్తారనే నమ్మకం జిల్లాలోని మహిళా ఉద్యోగులు, అధికారులపై కలెక్టర్ మురళీధర్‌రెడ్డి గారికి ఉందని.. ఆయన అందిస్తున్న విశేష మద్దతుతోనే ఈ రోజు చక్కగా పనిచేస్తున్నామని జేసీ (డబ్ల్యూ) జి.రాజకుమారి పేర్కొన్నారు. దిశ వన్‌స్టాప్ సెంటర్, శిశుగృహాలు, స్వాధార్‌హోంలు.. ఇలా వివిధ కేంద్రాల్లో మహిళలు అందిస్తున్న సేవలు మరువలేనివని ప్రశంసించారు. కన్నతల్లిని మించి వారు చిన్నారులపై చూపిస్తున్న ప్రేమానురాగాలు ఎంతో గొప్పవన్నారు. చేసే ప్రతి పనినీ ఆస్వాదించినప్పుడే సానుకూల శక్తి లభిస్తుందని, మహిళా ఉద్యోగులు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకొని ముందడుగు వేయాలని సూచించారు. కోవిడ్ సమయంలో సేవలందించిన వైద్యులు, వైద్య, ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. మన లోపలి ప్రపంచాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే బయటి ప్రపంచంలో మనం ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. పుస్తక పఠనం వంటి ఏదైనా హాబీని అలవరుచుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
లక్ష్మీ శ్రీలేఖకు సత్కారం:
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ; నెహ్రూ యువ కేంద్ర ఉమ్మడిగా నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంటు ఫెస్టివల్-2021లో జిల్లా, రాష్ట్ర స్థాయులను దాటుకొని ఫైనల్స్‌కు చేరుకొని, తూర్పుగోదావరి జిల్లా కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన డి.లక్ష్మీ శ్రీలేఖను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సత్కరించారు. ఆమె నేటి రోల్‌మోడల్ అంటూ ప్రశంసించారు. శ్రీలేఖ.. గౌరవ ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్‌తో పాటు విద్యాశాఖ, యువజన వ్యవహారాల శాఖ మంత్రుల ముందు పార్లమెంటులో ఫైనల్స్‌లో భాగస్వామ్యమయ్యారు. లక్ష్మీ శ్రీలేఖ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. అమ్మమ్మ, అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ రోజు ఇంతమంది ముందు నిలబడగలిగానన్నారు. మహిళలు చెప్పాలనుకున్నది ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో చెప్పగలగాలని పేర్కొన్నారు.
సందడిగా మహిళా దినోత్సవ వేడుకలు:
కలెక్టరేట్‌లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో స్వాధార్‌హోంకు చెందిన చిన్నారుల నృత్యాలు అలరించాయి. మహిళా దినోత్సవం, బాల్య వివాహాల నిర్మూలన అంశాలపై నృత్యరూపకాలు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో విశేష సేవలందించిన 50 మంది మహిళలకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, అతిథులు ప్రశాంసా పత్రాలు, బహుమతులు అందించారు. బాలికలు నెలసరి సమయంలో తీసుకోవాల్సిన సంరక్షణకు సంబంధించి మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ రూపొందించిన స్వేచ్ఛ పోస్టర్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఛైర్‌పర్సన్ బి.పద్మావతి, జేజేబీ మెంబర్ వై.పద్మలత, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్బలక్ష్మి, ఎస్‌సీ కార్పొరేషన్ ఈడీ సునీత, బీసీ వెల్ఫేర్ డీడీ మయూరి, ఐసీడీఎస్ పీడీ డి.పుష్పమణి, ఏపీడీ డి.విజయలక్ష్మి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.