నేటి నుంచే అనంతలో మద్యం బంద్..


Ens Balu
1
Anantapur
2021-03-08 17:27:34

అనంతపురము  జిల్లాలో మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో  ఎన్నికలు నిర్వహిస్తున్న పట్టణ ప్రాంతాల్లో మద్యం షాపుల మూసివేతపై జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. నేటి సాయంత్రం 5 గంటల నుంచి మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు మరియు పోలింగ్ నిర్వహించే ప్రాంతాలకు 5 కిలోమీటర్ల పరిధిలోని మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ పూర్తయ్యే వరకూ మద్యం షాపుల బంద్ కొనసాగుతుందన్నారు. ఎక్కడైనా రీపోలింగ్ అనివార్యమైతే మార్చి 13న రీపోలింగ్ నిర్వహించనున్నందున ఆయా ప్రాంతాల్లో మార్చి 11 సాయంత్రం 5 గంటల నుంచి 13న పోలింగ్ పూర్తయ్యేవరకూ మద్యం షాపులు మూసివేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం మార్చి 14 నాడు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కారణంగా మద్యం షాపులు బంద్ చేయవలసి ఉంటుందన్నారు.  జిల్లాలోని 11 పట్టణాలలో మునిసిపల్ ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. ఆయా ప్రాంతాల్లోని ఆబ్కారీ శాఖ హోల్ సేల్ డిపోలు, రిటెయిల్ ఔట్ లెట్లు,  కల్లు దుకాణాలు మొదలగునవి నిర్దేశించిన సమయాల్లో మూసివేయాలని కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు.