మలేరియా రహిత జిల్లాగా శ్రీకాకుళం..డిఎంఓ గొల్లవీర్రాజు
Ens Balu
2
Srikakulam
2020-08-20 18:41:02
శ్రీకాకుళం జిల్లాను మలేరియా రహితంగా తయారుచేయుటకు సంపూర్ణ దోమల నివారణకు చర్యలు తీసికుంటున్నామని జిల్లా మలేరియా నివారణ అధికారి గొల్ల వీర్రాజు చెప్పారు.గురువారం ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో దోమల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందించి, పగడ్బంధీగా అమలు చేస్తున్నామని అన్నారు.జిల్లాలో 368 గ్రామాలను హైరిస్క్ గ్రామలుగా గుర్తించి, పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో పిచికారీ చేస్తున్నామని అన్నారు.హై రిస్క్ ప్రాంతాల్లో లక్ష గంబుషియా చేపలను పెద్ద నీటి నిల్వ గల ప్రాంతాల్లో విడిచిపెట్టామని ఆయన వెల్లడించారు. స్థానిక సంస్థలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో దోమల నివారణకు పెద్ద ఎత్తున అవగాహనా సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు మలేరియా బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.ప్రతీ ఒక్కరూ ఆయా ప్రాంతాల్లో నిల్వ నీరు లేకుండా చేసికుంటే దోమకాటుకు గురికాకుండా కాపాడుకోవచ్చు అని ఆయన తెలిపారు. జిల్లాలో29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక్క ఏజన్సీ ప్రాంతాల్లో ఉన్నాయని , గిరిజనులకు 50,900 దోమతెరలు పంపిణీ చేసామని, ఇందులో గిరిజన విద్యార్థులకు 12,900 దోమతెరలు అందించామని అన్నారు.దోమతెరలు వినియోగం, వ్యక్తిగత పరిశుభ్రతపై ఏజన్సీ ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో రెండు విడతల్లో మలేరియా పిచికారీ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. మొదట విడత పూర్తి స్థాయిలో జరిగిందని, రెండవ విడత ఆగస్టు 1 నుండి నుండి సెప్టెంబర్15 వరకు జరుగుతుందని ఆయన అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలో దోనుబాయ్,కుసిమి ,పూతికివలస,పొల్ల గిరిజన ప్రాంతాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామని వీర్రాజు చెప్పారు.