దువ్వూరి సుబ్బమ్మ మహిళా లోకానికే ఆదర్శం..
Ens Balu
2
Visakhapatnam
2021-03-08 19:16:42
ఆంధ్రప్రదేశ్ లోని తొలి స్వాతంత్ర్య సమరయోధురాలు, దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ చరిత్ర భావితరాలకు తెలియజేసే బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డా.ఎం.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖలో సిపిఎంజీ కార్యాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దువ్వూరి సుబ్బమ్మ పేరుతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నిజమైన గాంధేయవాదిగా పేరొందినది సుబ్బమ్మ మాత్రమేనన్నారు. రాజమండ్రిలో ఉప్పుసత్యాగ్రహంలో ఎంతో చురుకుగా పాల్గొనడంతోపాటు, ఖాదీ వస్త్రాలు వినియోగంలోనూ, పేదలకు పంచడంలోనూ ప్రజల్లో బాగా చైతన్యం తేవడంతో కీలక పాత్ర పోషించారన్నారు. దేశీయ ఉద్యమంలో పాల్గొన్న సమయంలో రాజమండ్రి, రాయవెల్లూర్ జైళ్లలో జైలు శిక్ష అనుభవించారని గుర్తుచేశారు. ఆమె చరిత్ర ప్రజలకు బాగా చేరువ కావాలనే ఉద్దేశ్యంతోనే ఈపోస్టల్ కవర్ ను తీసుకు వచ్చామని అన్నారు. అంతకు ముందు మహిళా ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పోస్టల్ కవర్ల ద్వారా ప్రజలకు, చరిత్రకారుల విలువలు తెలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్పీ సోమశేఖరరావు, ఎస్పీ ప్రసాదబాబు, అసిస్టెంట్ డైరెక్టర్ నాగాదిత్యకుమార్, పి.ఆనందరావు, కార్యాలయంలోని మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.