మున్సిపల్ ఎన్నికలు పక్కాగా నిర్వహించాలి..
Ens Balu
2
Anantapur
2021-03-09 12:20:44
అనంతపురం జిల్లాలో ఈ నెల 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సామగ్రి పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్స్ లో ఏర్పాట్లు, ఓటరు స్లిప్పుల పంపిణీ పై జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ లు, నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మునిసిపల్ ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ ను త్వరితగతిన పూర్తి చేయాలని, మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద త్రాగునీరు, కుర్చీలు, టేబుళ్లు, మైకు,మెడికల్ క్యాంపు, టాయిలెట్స్, శానిటేషన్, పోలింగ్ కేంద్రాల రూటు నెంబర్స్ తో వాహనాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇతర అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టాలన్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు డబ్బు, మద్యం, తాయిలాలను పంపిణీ చేసే అభ్యర్థులపై, ఖర్చు పై గట్టి నిఘా పెట్టాలని, మోడల్ కోడ్ ను కఠినంగా అమలు చేయాలన్నారు. ఓటరు స్లిప్పులను వంద శాతం ఆయా బి.ఎల్.ఓ ల ద్వారా పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఇంకా ఎక్కడైనా మిస్ అయిన ఓటర్లు ఉంటే అటువంటి వారికి బి.ఎల్.ఓ ల ద్వారా ఓటరు స్లిప్పులను పంపిణీ చేయించాలన్నారు. ఎలాంటి ఫిర్యాదులు ఓటర్ల నుండి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్ సిబ్బందికి, మైక్రో అబ్జర్వర్లకు, రూట్ అధికారులు, జోనల్ అధికారులు, వెబ్ క్యాస్టింగ్ సిబ్బంది, పోలీసు సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల వద్ద, పోలింగ్ కేంద్రాల వద్ద మంచి భోజన సదుపాయాలు, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. పోలింగ్ విధులకు కేటాయించిన సిబ్బంది ఎవరైనా గైర్హాజరైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, ఓటరు అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి ఓటర్లు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ తో పాటు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు, ఎస్.ఈ.సి నిబంధనల మేరకు స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తీ చేయాలన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మీడియాకు ఇబ్బంది లేకుండా ఒక మీడియా సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్, కౌంటింగ్, ఎన్నికల సిబ్బందికి ఇబ్బంది లేకుండా మంచి ఆహారాన్ని అందించాలన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి నిర్దేశిత ప్రొఫార్మా లో పోలింగ్ రిపోర్ట్ ను ప్రతి రెండు గంటలకు ఒకసారి అందజేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.