అల్లూరి పేరుతో నాణెం విడుదల చేయాలి..
Ens Balu
2
Rajahmundry
2021-03-09 12:30:14
స్వాతంత్య్ర సమరయోధుడు ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు ఈ సంవత్సరం జూలై 4న 125వ జయంతిని పురస్కరించుకొని 125 రూపాయాల నాణాన్ని విడుదల చేయాలని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పడాల వీరభద్రరావు ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ పేరున ‘పరాక్రమ దివాస్’ పేరుతో రూ.125 నాణాన్ని విడుదల చేసినందుకు ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి పడాల వీరభద్రరావు ధన్యవాదాలు తెలియజేశారు. నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దౌర్జన్యాన్ని దౌర్జన్యంతోనే... ఆయుధాన్ని ఆయుధంతోనే... ఎదుర్కోవాలనే ధృడ సంకల్పంతో బ్రిటీషు సామ్రాజ్యవాదులను ముందుగా హెచ్చరించి, పట్టపగలు వరుసగా పోలీస్ స్టేషన్లపై దాడులుచేసి, ఆయుధాలను సమీకరించి, బ్రిటీషు సామ్రాజ్యవాదులపై మూడేళ్ళు ప్రత్యక్ష సాయుధ పోరాటం సాగించారని గుర్తు చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు నేతాజీ జన్మించిన 1897 సంవత్సరంలోనే జన్మించారని, ఆ ఇద్దరి మహనీయుల ఆశయాలు ఒక్కటేనని ఆ కారణంగా ఈ సంవత్సరం జూలై 4న జరిగే అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని అల్లూరి పేరున రూ.125 నాణాన్ని విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కోరారు. ఈ మేరకు జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీజీకి లేఖ వ్రాసినట్టు పడాల వీరభద్రరావు ఆ ప్రకటనలో తెలిపారు.