మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాటు పూర్తి..


Ens Balu
2
Salur
2021-03-09 16:42:18

విజయనగరం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, ఒక మునిసిపల్ కార్పొరేషన్ కు బుధవారం నిర్వహించనున్న పుర, నగర పాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు ఎన్నికల అధికారి డా.హరిజవహర్ లాల్  వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ లో భాగంగా ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలించే ప్రక్రియను సాలూరు, నెల్లిమర్ల, విజయనగరంలలో కలెక్టర్ పర్యవేక్షించారు. ప్రతి కౌంటర్ వద్దకు వెళ్లి ఎన్నికల సిబ్బందికి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మూడు పురపాలక సంఘాలు, ఒక  నగర పంచాయతీ, ఒక నగరపాలక సంస్థకు సంబంధించి బుధవారం ఎన్నికలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందు కోసం పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బందిని తరలించే ఏర్పాట్లు పర్యవేక్షణకై ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. 376 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. అయితే  నామినేషన్లు అనంతరం ఐదో వార్డులో అభ్యర్ధి మరణించడంతో ఆయా స్థానాలలో 12వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నిర్దేశించిందన్నారు. దీంతో 371 పోలింగ్ కేంద్రాలలో రేపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్ శాతం గంట గంటకూ వెల్లడించేందుకై  జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా వీలైనంత త్వరగా ఓట్ల నమోదు శాతాన్ని వెల్లడించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారన్నారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు  కిట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఓటర్ కు థర్మల్ స్కేనర్ తో పరీక్షించి, పోలింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా సిబ్బందికి శానిటైజర్లు,మాస్కులు వంటివి అందజేస్తున్నామన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పోలింగ్ ఆఫీసర్లకు  ప్రత్యక్ష శిక్షణ ఇచ్చామన్నారు. ఓటర్లు క్యూ లైన్లో ఎక్కువగా ఉన్నట్లయితే త్వరితగతిన ఓటింగ్ జరిగే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసామన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను రాజీవ్ క్రీడామైదానంలో  ఉన్న స్ట్రాంగ్  రూమ్ లో భద్రపరచనున్నట్లు చెప్పారు. ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి పారదర్శకంగా  నిర్వహించనున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల నిఘాతో కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లు చెప్పారు. నగరంలోని రాజీవ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందితో మాట్లాడారు. వారికి ఏర్పాటు చేసిన భోజనాలను పరిశీలించి వంటకాల రుచి, నాణ్యత గురించి సిబ్బందితో ఆరా తీసారు. వంటలు బాగున్నాయని, రుచికరంగా వున్నాయని తెలుపడంతో సంతృప్తి వ్యక్తం చేసారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ ,నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ ఎస్ వర్మ పాల్గొన్నారు. అంతకు ముందు సాలూరు మునిసిపల్ కార్యాలయంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ కు వివరించారు. పోలింగ్ సిబ్బంది తో పాటు పోలింగ్ ఏజెంట్లకు కుడా మాస్క్ లు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. సాలూరు లో పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ ను జె.సి. డా.కిషోర్ కుమార్ శాలువాతో సత్కరించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ విధెహ్ ఖరే, మునిసిపల్ కమీషనర్ రమణ మూర్తి పర్యటనలో పాల్గొన్నారు.