రబీకి పూర్తిస్థాయిలో నీరందించాలి..
Ens Balu
3
Kakinada
2021-03-09 17:31:21
సమర్థ నీటి యాజమాన్యం, పటిష్ట పంపిణీ ప్రణాళిక ద్వారా సాగులో ఉన్న రబీ పంటలను విజయవంతంగా పూర్తిచేసేందుకు అన్ని చర్యలు గైకొంటున్నామని జిల్లా కలెక్టర్ డి.మురళీధర రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులతో సాగు, తాగునీటికి కొరత రాకుండా చేపట్టిన చర్యలపై కలెక్టర్ మురళీధరరెడ్డి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్ ర్, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగిస్తూ రబీ వరి సాగును విజయవంతంగా పూర్తిచేయడం ప్రధానమని, ఈ విషయంపై అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్.. అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. సీలేరు నుండి సమకూరిన జలాలతో కలిపి పస్తుతం 7,600 క్యూసెక్‌ల నీరు అందుబాటులో ఉండగా, దీన్ని 8000 క్యూసెక్‌లకు పెంచనున్నట్లు ఆయన వెల్లడించారు. సాగునీటి పరంగా ఒత్తిడి ఉన్న కరప, పెదపూడి, కాజులూరు, ముమ్మిడివరం తదితర మండలాల్లో ఇప్పటికే ఉన్న మోటార్లకు అదనంగా మరికొన్నింటిని ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆయిల్ సరఫరా చేసే ఏజెన్సీల సంఖ్యను పెంచాలని సూచించారు. ఒత్తిడి ఉన్న ప్రాంతాలకు అవసరమైన నీరు అందేలా ఎగువ ప్రాంతాల్లో నీటి సక్రమ నిర్వహణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటిని సద్వినియోగం చేసుకోవడంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 31 నాటికి అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నీటి విడుదల ప్రణాళికలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నీటిని నింపే చర్యలు అమలవుతున్నాయని.. ఈ నెల 25 నుంచి ఈ చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు. ప్రతి నీటి బొట్టూ ఎంతో విలువైందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీరు వృథా కావడానికి వీల్లేదని ఈ మేరకు నీటి పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణాల్లో కాలనీల సంక్షేమ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేసి, నీటి పొదుపు ఆవశ్యకతను వివరించాలన్నారు. ఇతరత్రా అవసరాలకు రీ సైక్లింగ్ వాటర్ వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్‌కు సూచించారు. అలాగే గృహాలలో త్రాగునీటి కనెక్షన్లకు బిగించిన మోటార్ల తొలగించాలనన్నారు. కాలువల శివారులో ఉన్న రాజోలు, పి.గన్నవరం మండలాల్లోని గ్రామాలకు, యానం ప్రాంతాన కి త్రాగునీటి ఇబ్బంది రాకుండా క్రాస్ బండ్లు, మోటార్ల ద్వారా నీటిని స్టోరేజికి సేకరించేందుకు అనుమతించి, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అలాగే సాగు, త్రాగు నీటి అవసరాలు తీర్చి, అందుబాటులో ఉన్న నీటిని పారిశ్రామిక అవసరాలకు అందించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఇరిగేషన్, డ్రెయిన్, గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఆర్.శ్రీరామకృష్ణ, టి.గాయత్రీదేవి, రవికుమార్, ఐవీ సత్యనారాయణ తదితరులతో పాటు వ్యవసాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్, డీడీ రామారావు తదితరులు పాల్గొన్నారు.