సజావుగా పురపాలిక ఎన్నికలు..


Ens Balu
2
Srikakulam
2021-03-10 12:01:32

శ్రీకాకుళం  జిల్లాలో  పలాస , ఇచ్చాపురం, పాలకొండ పురపాలిక ప్రాంతాలలో నేడు పోలింగ్ జరుగుతుందని, ఎన్నికలు అన్ని చోట్లా సజావుగా జరుగుతున్నాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్  వెల్లడించారు.  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను బుధవారం ఉదయం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో గల 106 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. జిల్లావ్యాప్తంగా 96,170 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కలెక్టర్ తెలిపారు. మూడు పురపాలిక ప్రాంతాల్లో 70 వార్డుల్లో పోలింగ్ జరుగుతున్న నేపధ్యంలో సమస్యాత్మక కేంద్రాలు కూడా ఉన్నాయని, అటువంటి కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. క్షేత్రస్థాయిలో పోలింగ్ ప్రక్రియను ఎస్.పి అమిత్ బర్దార్, జె.సిలు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, డా. కె శ్రీనివాసులు స్వయంగా పరిశీలిస్తున్నారని, తాను కూడా కొన్ని ప్రాంతాలను సందర్శించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఉదయం 09.00 గం.లకు మూడు ప్రాంతాల్లో కలిపి సగటున 8.81 శాతం పోలింగ్ నమోదైందని, ఓటర్లలో తెచ్చిన అవగాహన వలన సాయంత్రానికి పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లను చైతన్యపరిచేందుకు అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించడం జరిగిందని, అలాగే పోలింగ్ కు 10 రోజుల ముందే ఓటర్లకు ఓటర్ స్లిప్పులను జారీచేయడం జారింది అన్నారు. దీనివలన ఓటరుకు చెందిన పోలింగ్ స్టేషన్ సులభంగా తెలుస్తుందని , తద్వారా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి సోమశేఖర్, గృహ నిర్మాణ సంస్థ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ , ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.