16 నుంచి శత జయంతి ఉత్సవాలు..
Ens Balu
1
Srikakulam
2021-03-11 14:08:12
ఆదర్శనీయమూర్తిమత్వం, ఆదరణీయ వ్యక్తిత్వం, ఆచరణీయ మానవ విలువలు కలబోత కీర్తిశేషులు ధర్మాన రామలింగంనాయుడు శతజయంతి ఉత్సవాలను ఈ నెల 16 నుంచి ఏడాది పాటు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. గురువారం మబగాంలో రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ విశ్రాంత కమిషనర్ డాక్టర్ దీర్ఘాశి విజయభాస్కర్ అధ్యక్షతన జరిగిన శతజయంత్యుత్సవాల సన్నాహక సమావేశంలో ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్వర్గీయ రామలింగంనాయుడు సూరేళ్ల జ్ఞాపకాలకు వారు నడచిన ఈ నేల నివాళులలర్పిస్తోందని అన్నారు. ఆయన మంచి ఆంగ్లభాషాభిలాషి సంస్కృత భాషా పిపాసిగా గుర్తింపు పొందారని తెలిపారు. రంగస్థల కళలపట్ల ఆయన ఎంతో మక్కువ చూపించేవారని, వారి ఔన్నత్యాన్ని సేవానిరతిని స్మరించుకోవడం లో భాగంగా ధర్మాన ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తన తండ్రి శతజయంతి ఉత్సవాల నిర్వహణ ఉంటుందన్నారు. ఈనెల 16న మంగళవారం ఉ దయం 9.45 గంటలకు ముద్దాడ కృష్ణవేణి దీపారాధనతో మొదలయ్యే ఈ ఉత్సవాలలో గుమ్మా నగేష్ శర్మ పర్యవేక్షణలో 21 మంది రుత్విక శ్రేష్టులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య సారధ్యంలో జరిగే శోభాయాత్రలో మబుగాం పురవీధుల నుండి నాదస్వర విన్యాసాలు, చెంచుబాగోతం, వాలీ-సుగ్రీవుల యుద్ధం, డప్పువాయిద్యాలు, తప్పెటగుళ్లు కోయిన్ృత్యాలు తదితర చిక్కోలు జానపద కళారీతుల ప్రదర్శన ఉంటుందని తెలిపారు. డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన రోజున సాయంత్రం ఆరు గంటల సభాకార్యక్రమం, అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు సాంస్కృతిక విభావరి నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో టేకు వీరభద్రాచారి, మర్రివలప హరిబాబులచే గయోపాఖ్యానం యుద్ధ సన్నివేశం, పెద్దింటి రామ్మోహనరావు దుర్యోధన ఏకపాత్ర, సరస్వతి నాటక కళాసమితి సత్యహరిశ్చంద్ర వారణాశి ఘట్టం ప్రదర్శిస్తారని వివరించారు. ఈ సమావేశంలో ధర్మాన రామదాస్, ధర్మాన రామమనోహరనాయుడు, గురుగుబిల్లి లోకనాథం, చౌదరి సతీష్, మునుకోటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.