పారదర్శకంగా మున్సిపల్ ఓట్ల లెక్కింపు..


Ens Balu
1
Visakhapatnam
2021-03-11 20:26:59

విశాఖ  జిల్లాలో జివిఎంసి, ఎలమంచిలి, నర్సీపట్నం  మున్సిపాలిటీలకు నిర్వహించే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని  జిల్లా ఎన్నికల అథారిటీ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  గురువారం వి.ఎం.ఆర్.డి.ఎ.చిల్డ్రన్ ఎరీనా లో  ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆయన పలు సూచనలు చేశారు. బ్యాలెట్ పేపర్ చెల్లుబాటు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని   బ్యాలెట్ పేపర్  అభ్యర్థుల తరపున ఏజెంట్లకు చూపించే లెక్కింపు చేయాలన్నారు.   బ్యాలెట్ పేపర్ ల చెల్లుబాటుకు సంబంధించి అంశాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలన్నారు.  ఓట్ల లెక్కింపులో తెలిసి చేసినా, తెలియక చేసినా చర్యలు తప్పవని గుర్తించాలన్నారు.  ముందుగా పోస్టల్ బ్యాలెట్ ను లెక్కించాలని, తరువాత మిగిలిన బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కించడం మొదలవుతుందన్నారు. లెక్కింపునకు సంబంధించి వివిధ ప్రొఫార్మాలను   ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రౌండ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ఏజెంట్లకు వివరాలను తెలియజేసి వారి సంతకాలు తీసుకోవాలన్నారు. రౌండ్లవారీ లెక్కింపులో పొరపాట్లు రాకుండా చూసుకోవాలన్నారు.  స్ట్రాంగ్ రూమ్ నుండి బ్యాలెట్ బాక్సులు వచ్చిన వెంటనే  25 చొప్పున కట్టలు కట్టాలని, లెక్కింపు పూర్తయిన వెంటనే అభ్యర్థుల వారీగా కట్టకు 50 చొప్పున  భద్రపరచాలన్నారు.  ప్రణాళిక ప్రకారం లెక్కింపు నిర్వహించినట్లైతే ఎటువంటి తప్పులకు అవకాశం ఉండదన్నారు.  కార్యక్రమం ప్రారంభంలో జీవీఎంసీ కమిషనర్ అదనపు ఎన్నికల అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ  ప్రాధమికమైన సమాచారాన్ని ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించే క్రమంలో వారికి నియమ నిబంధనలు గూర్చి,  కరోనా జాగ్రత్తలను గూర్చి తెలియజేయాలన్నారు.  జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగార్జునసాగర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల లెక్కింపు విధివిధాలను వివరించారు.  ఈ సమావేశంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, జి.వి.యం.సి ఎడిషనల్ కమీషనర్ ఆశా జ్యోతి , జోనల్ కమీషనర్ లు, ఆర్.ఓ.లు, ఎ.ఆర్.ఓ.లు తదితరులు పాల్గొన్నారు.