మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు..
Ens Balu
2
Vizianagaram
2021-03-12 11:51:59
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును ఈ నెల 14న ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లూ చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ చెప్పారు. విజయనగరం కార్పొరేషన్‌లోని 5వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మృతి చెందిన కారణంగా శుక్రవారం జరిగిన ఎన్నిక ప్రక్రియను ఆయన పరిశీలించారు. మొత్తం ఐదు పోలింగ్ బూత్‌లను సందర్శించి, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఓటర్లతో మాట్లాడి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఓటర్లకు ఎండవల్ల ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను మార్పు చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ప్రత్యేక ఆదేశాలకు అనుగుణంగా 5 డివిజన్‌లో ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎప్పటిలాగే ఇక్కడ కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు గాను, ఇప్పటికే ఓటర్లకు ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ, ఎవరైనా మిగిలిపోయి ఉంటే, అటువంటి వారికోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ను ఏర్పాటు చేసి, కంప్యూటర్ ద్వారా వారి ఓటు వివరాలన శోధించి, అక్కడికక్కడే ఓటర్ స్లిప్పులను అందజేయడం జరుగుతోందన్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. నెల్లిమర్ల మినహా, మిగిలిన నాలుగు మున్సిపాల్టీలకు నలుగురు ఐఏఎస్ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించామని, వీరంతా కౌంటింగ్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి రెండో విడత శిక్షణా కార్యక్రమాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆయా మున్సిపాల్టీల కౌంటింగ్ సెంటర్లలోనే శిక్షణ ఏర్పాటు చేశామని, కౌంటింగ్ నమూనా కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికలకు సహకరించినట్లుగా, కౌంటింగ్‌ను కూడా ప్రశాంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, తాశీల్దార్ ఎం.ప్రభాకరరావు, ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.