కెజిహెచ్ కు సిఫారసులు ఉండరాదు..


Ens Balu
1
Srikakulam
2021-03-12 14:14:15

శ్రీకాకుళం జిల్లా నుంచి కెజిహెచ్ కు సిఫారసులు ఉండరాదని జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చేసారు. స్థానికంగా వైద్యం అందించే పరిస్థితి లేనపుడు అత్యంత అత్యవసర కేసులు మినహా ఏ కేసులు సిఫారసు చేయరాదని పేర్కొన్నారు. జిల్లాలో నిపుణులు అయిన వైద్యులు ఉన్నారని ఆయన చెప్పారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మాతృ, శిశు మరణాలపై ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. శ్రీకాకుళం నుండి విశాఖపట్నం వెళ్లే సమయంలో అత్యవసర శస్త్ర చికిత్సలు అవసరం అయితే, పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వందల కొద్ది కిలోమీటర్లు ఎందుకు ప్రయాణించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. శస్త్ర చికిత్సలకు, వైద్య పరీక్షలకు అవసరమైన సామగ్రి ఉందని, అవసరమైతే ఇంకా సమకూర్చుటకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. స్థానికంగా రక్తపు యూనిట్లు, అన్ని సౌకర్యాలు లభ్యంగా ఉన్నప్పటికీ సిఫారసు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రాన్సిట్ చేయడం వలన మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో మంచి సేవలు అందించారని అభినందిస్తూ ప్రసవ సమయంలో సైతం అటువంటి సేవలు కొనసాగాలని అన్నారు. గర్భిణి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలని తదనుగుణంగా అవసరమైనప్పుడు ఏర్పాటు చేసే పరిస్థితి ఉండాలని సూచించారు. అన్ని కేసులను కెజిహెచ్ కు పంపించాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. వైద్య పరీక్షలు పక్కాగా నిర్వహించాలని, ఎటువంటి లోపాలు ఉండరాదని ఆయన పేర్కొన్నారు.    ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి తదితర ప్రాంతాల నుండి శ్రీకాకుళం, విశాఖపట్నం ఆసుపత్రులకు సిఫారసు చేయడం పట్ల వైద్యుల వివరణ కోరారు. పాలకొండలో ఫిజీషియన్, ఇతర వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికి ఆ చుట్టుపక్కల నుండి కె.జి.హెచ్ కు పంపించడం పట్ల ప్రశ్నించారు. మూడవ, నాలుగవ సారి గర్భం ధరించకుండా తగిన అవగాహన కలిగించాలని కలెక్టర్ సూచించారు. ఏడవ సారి గర్భం ధరించిన వారు కూడా ఉండటం విచారకరమన్నారు.  ఇది కేవలం సిబ్బంది వైఫల్యంగానే పరిగణించడం జరుగుతుందని ఆయన అన్నారు. యూరిన్ నమూనాలు ఎందుకు తీసుకోవడం లేదని అన్నారు. జలుమూరు పి.హెచ్.సి పరిధిలో ఒక కేసుపట్ల శ్రద్దవహించని ఆశా కార్యకర్తకు మెమో జారీ చేయాలని ఆయన ఆదేశించారు. ఎక్కువ సార్లు గర్భం ధరించడం వలన వచ్చే ఆరోగ్య, ఆర్ధిక ఇబ్బందులను భార్య భర్త, అత్తామామ లకు వివరించాలని ఆదేశించారు. గిరిజన, మారుమూల ప్రాంతాల పట్ల దృష్టి సారించాలని పేర్కొన్నారు. మొదటిసారి గర్భం దాల్చినప్పుడే తగు ఆరోగ్య సూచనలు చేయాలని, ఆడ, మగ బిడ్డలలో ఎవరైనా సమానమేనని చైతన్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ ఉద్బోధించారు. లింగనిర్ధారణలో సైతం  మహిళా పాత్ర ఉందని, పురుషుల క్రోమోజోమ్ ఆధారంగా జరుగుతుందని స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. గర్భిణులు అంగన్వాడీ వద్ద పౌష్టికాహారం పొందుతున్నది లేనిది పరిశీలించాలని అన్నారు. గర్భిణులకు పౌష్టికాహారం అవసరమని ఆయన పేర్కొన్నారు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.బ్లడ్ స్టోరేజి కలిగిన ఆసుపత్రులు రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్త దాన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.  క్రిటికల్ కేర్ అవసరమైన కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. సంభవించిన మరణాలను విశ్లేషిస్తే 8 మరణాలు అరికట్టి ఉండవచ్చని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరణించిన వారిలో 4, 7 వ సారి డెలివరీకి వచ్చిన వారు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ప్రసవ సమయంలో మరణించడం సరికాదని పేర్కొంటూ అరికట్టగలిగే  ఎటువంటి కేసు మరణానికి గురికారాదని కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి.సూర్యారావు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, వైద్య శాఖ అధికారులు డా.బి.జగన్నాథ రావు, డా.ఏ.అనురాధ, డా.లీల, డా.ఎన్. ఏ.వి.వి.వి.పి.రామి రెడ్డి,  వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.