మంచినీటి ఇబ్బందులు రాకుండా చూడాలి..


Ens Balu
3
Vijayawada
2021-03-12 16:44:40

ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చేదిశలో ఆర్ డబ్ల్యుయస్ అధికారులు క్షేత్రస్ధాయిలో నిర్ధేశించుకున్న లక్ష్యాలను ప్రణాళికమేరకు పూర్తి చేయాలని కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ ఆదేశించారు. శుక్రవారం స్ధానిక కలెక్టరు క్యాంపు కార్యాలయలో ఆర్ డబ్ల్యుయస్ మండల క్షేత్రస్ధాయి సిబ్బందితో ఆర్ డబ్ల్యుయస్ పనుల ప్రగతిపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ క్షేత్రస్ధాయిలోని ఆర్ డబ్ల్యుయస్ అధికారులు వారికి నిర్ధేశించిన పనులను హేబిటేషన్స్ వారీగా లక్ష్యాల ప్రగతిసాధనకు చొరవ చూపాలన్నారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజల త్రాగునీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఓహెచ్‌యస్ఆర్ ల నిర్వాహణా పనులను పూర్తి చేయాలన్నారు. జలజీవన్ మిషన్ క్రింద జిల్లా వ్యాప్తంగా 361 పనులను నిర్ధేశించుకోవడం జరిగిందన్నారు. ఇందుకోసం రూ. 512 లక్షల రూపాయల పనులకు ప్రతిపాదనలు మంజూరు చేయడం జరిగిందన్నారు. వీటిలో రూ. 5 లక్షల రూపాయల లోపు పనులకు సంబంధించి 318 పనులు చేపట్టాల్సి ఉంటుందని వీటిని మార్చి 31 లోపులో పూర్తి చేయాలన్నారు. జగనన్న హౌసింగ్ కాలనీ క్రింద జిల్లాలో 595 పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. వీటికి సంబంధించి క్షేత్రస్ధాయిలో పనులను ప్రారంభించాలని ఇందుకు సంబంధించి మౌలికవసతులు తదితర అంశాలపై నివేదికలను రూపొందించుకోవాలన్నారు. వీటిలో రూ. 5 లక్షల రూపాయలు లోపు పనులను ఏప్రిల్ 20 కల్లా పూర్తి చేయాలని కలెక్టరు ఇంతియాజ్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 39 సిపిడబ్ల్యు పనులను చేపడుతున్నామని వీటిని త్వరితగతిన పూర్తి చేసేలాగా క్షేత్రస్ధాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలోని రక్షిత త్రాగునీటి సరఫరా చేసే ఓవర్ హెడ్‌టాంకుల ఫిల్టర్ బెడ్‌లు, తదితర మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంతియాజ్ స్పష్టం చేశారు. రక్షిత త్రాగునీటి సరఫరా లక్ష్యంగా ఇంటింటికీ కనెక్షన్లు ఇచ్చే అంశంపై క్షేత్రస్ధాయి అధికారులు మరింత శ్రద్ధకనబరచాలని, పూర్తి చేసిన పనుల వివరాలను కూడా ఎ ప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నిర్ధేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో వెనుకబడిన బంటుమిల్లి, మండవల్లి, తిరువూరు, విస్సన్నపేట, నాగాయలంక, అవనిగడ్డ, జగ్గయ్యపేట, తదితర మండలాల అధికారులతో పనులలో ప్రగతిని చూపించాలని కలెక్టరు స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్ధాయిలో పనులపై మరింత దృష్టి కేంద్రీకరించాలని వచ్చే 24 గంటల్లో పనుల ప్రగతిలోనూ డేటాను అప్‌లోడ్ చేయాలన్నారు. ఈసమావేశంలో ఆర్ డబ్ల్యుయస్ యస్ఇ సాయినాధ్, ఇఇలు, డిఇలు, ఏఇలు, తదితరులు పాల్గొన్నారు.