ధాన్యం కొనుగోలు లక్ష్యాలు చేరుకోవాలి..
Ens Balu
2
Vizianagaram
2021-03-12 17:52:59
విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అందరూ సమన్వయంతో వ్యవహరించటం వల్ల 4.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగలిగామని జేసీ కిశోర్ కుమార్ పేర్కొన్నారు. అయితే వ్యవసాయ శాఖ నివేదికల ప్రకారం మరో 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇంకా రైతుల వద్ద ఉన్నట్లు తేలిందని, ఆ మిగులు ధాన్యం నిర్ణీత కాలంలో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్‌లో జరిగిన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై జేసీ కిశోర్ కుమార్ శుక్రవారం జిల్లాలోని మిల్లర్లతో, సంబంధిత అధికారులతో తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం దాదాపు చేరుకున్నామని, ఈ అదనపు ధాన్యం కూడా సేకరించేస్తే పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని అభిప్రాయపడ్డారు. పీపీసీల్లో కొనుగోలు చేసి ఇంకా మిల్లర్ల వద్దకు చేరని ధాన్యం వివరాలను మిల్లర్లను అడిగి తెలుసుకున్నారు. ఖరీఫ్‌లో వచ్చిన సమస్యలను అధిగమించి రబీలో మరింత పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేపట్టాలని, త్వరలోనే రబీ ప్రక్రియపై సమావేశం నిర్వహించి విధివిధానాలు ఖరారు చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మిల్లర్ల సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌వో పాపారావు, సివిల్ సప్లై డీఎం భాస్కరరావు, ఆర్డీవో భవానీ శంకర్, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండబాబు, పలువురు మిల్లర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.