స్వాతంత్రోద్యమ స్ఫూర్తితోనే అభివ్రుద్ధి..


Ens Balu
2
Visakhapatnam
2021-03-12 18:13:29

స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధివైపు అడుగులు వేయాలని   జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన  "ఆజాదీ కా స్వర్ణోత్సవ్"  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా  పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  స్వాతంత్రం వచ్చిన తరువాత దేశం అనేక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.  విద్య, వైద్యం, వ్యవసాయ, పారిశ్రామిక, విజ్ఞాన, సామాజిక రంగాలలో మనం ఇంకా ఎంతో సాధించవలసి ఉందన్నారు.  ఆర్థిక, సామాజిక, లింగ భేదాలను అధిగమించాలన్నారు. పౌరులందరికీ సమానమైన మౌలిక వసతుల కల్పించాలన్నారు.  ఇవన్నీ సాధించాలంటే ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు,  ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు సంకల్పంతో, నిబద్ధతతో పనిచేయాలన్నారు.  మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి  దేశంలో 90 శాతం నిరక్షరాశ్యత వుందని, ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశంగా వుండేదన్నారు.  డా.బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగం లిఖిత కమిటీని ఏర్పాటు చేశారన్నారు. 2 సం.ల 11 నెలల్లో రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు. 1950 నుండి పంచవర్ష ప్రణాళికలు రూపొందించడం, బ్యాంకుల జాతీయకరణ, భారీ పరిశ్రమల ఏర్పాటు మొదలైన వాటితో పాటు విద్య, వైద్య, వ్యవసాయ, మౌలిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించామని పేర్కొన్నారు.           జివియంసి కమిషనరు నాగలక్ష్మి మాట్లాడుతూ భావి తరాలకు స్వాతంత్ర్యోద్యమాన్ని గూర్చి,  జాతీయసమైక్యతా స్ఫూర్తిని గూర్చి తెలియ జేయాలన్నారు.  జాయింట్ కలెక్టరు ఎమ్.వేణుగోపాలరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లు అవుతున్న సందర్భంగా  75 వారాలు ముందు నుండి వివిధ కార్యక్రమాలు దేశమంతటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  అంతకుముందు జిల్లా కలెక్టరు తదితరులు మహాత్మా గాంధీ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేశారు.  జ్యోతి ప్రజ్వలన చేశారు. వివిధ కళాశాల, పాఠశాల విద్యార్ధినీ విద్యార్దులు జాతీయ గీతాలాపనలు, నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. నాగరాజ్ పట్నాయక్ దర్శకత్వంలో స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్ర్స్ కళాకారులు ప్రదర్శించిన  బహుభాషా నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జాయంట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు, డి.ఆర్.ఓ.  ఎ.ప్రసాద్, జెడ్.పి. సిఈఓ నాగార్జున సాగర్, డిఆర్ డిఎ  పి.డి. వి.విశ్వేశ్వరరావు, జె.డి. రమణమూర్తి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది  ఉపాధ్యాయులు పాల్గొన్నారు.