వేదపాఠశాలలో వారంతా బాగానే ఉన్నారు.


Ens Balu
2
Tirupati
2021-03-12 18:14:54

తిరుమల వేద పాఠశాల లో కోవిడ్ సోకిన 57 మంది విద్యార్థులు, ఒక అధ్యాపకుడు క్షేమంగా ఉన్నారని టీటీడీ చైర్మన్  వైవి సుబ్బారెడ్డి చెప్పారు.  స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని శుక్రవారం సాయంత్రం చైర్మన్, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, తుడా చైర్మన్, శాసన సభ్యులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి చైర్మన్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరికి మాత్రమే జలుబు ఉందని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ వివరించారు. 57మంది విద్యార్థులు, ఒక అధ్యాపకుడిని ప్రత్యేకంగా రెండు వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆమె చెప్పారు.  చైర్మన్, ఈవో విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహారం గురించి తెలుసుకున్నారు.   స్విమ్స్ కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేద పాఠశాల విద్యార్థులందరూ బాగా ఉన్నారని ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి మీడియాతో చెప్పారు.  ప్రభుత్వ అనుమతి మేరకు ఇటీవలే వేద పాఠశాల పునః ప్రారంభించామన్నారు. విద్యార్థుల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.   టీటీడీ నిర్మించదలచిన చిన్న పిల్లలు ఆసుపత్రి నిర్మాణానికి త్వరలో శంఖుస్థాపన చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ముంబైకి చెందిన ఒక భక్తుడు ఆసుపత్రి నిర్మాణం, పరికరాల ఏర్పాటు,నిర్వహణ విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారన్నారు. ఆసుపత్రికి నిర్మాణానికి 10 ఎకరాల భూమి ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఎంఓయు జరిగిందన్నారు.