మార్చినాటికి ఉపాది పనులు పూర్తి కావాలి...కలెక్టర్


Ens Balu
4
Visakhapatnam
2020-08-21 18:52:43

విశాఖ జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ  పధకం ద్వారా చేపట్టిన  నిర్మాణపనులు  నెలాఖరుకు పూర్తిగా ప్రారంభించి,  మార్చి నెలాఖరుకు  శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం  వుడా చిల్డ్రన్ ఎరీనా సమావేశమందిరంలో  డ్వామా, పంచాయతీరాజ్, ఐ.టి.డి.ఎ., పంచాయతీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ  గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్, అంగన్వాడి కేంద్రాల భవనాలు ప్రహరీల  నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య మిస్తున్నదని, ముఖ్యమంత్రి  వీటి నిర్మాణాలపై శ్రద్దవహిస్తూ ఎప్పటి కప్పుడు పనులు పురోగతిని తెలుసుకుంటున్నారని తెలిపారు. అంతే కాకుండా  ప్రభుత్వ అనుమతి పొందిన మిగిలిన పనులను కూడా పూర్తి చేయాలన్నారు.   పథకాల వారీగా పనులను సమీక్షిస్తూ  జిల్లాకు రూ.447 కోట్ల పనులు మంజురయ్యాయని, డిశంబరు నాటికి రూ.284 కోట్లు పనులు  పూర్తిచేయుటకు ప్రణాళిక సిద్దం చేశారని, మార్చి నాటికి మిగిలిన రూ.163 కోట్ల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళిక తయారు చేసు కోవాలన్నారు.  ప్రతి గురువారం పనుల పురోగతిని సమీక్షిస్తామని, మండల వారీగా ప్రతి వారం లక్ష్యం ప్రతిపాదించుకొని పూర్తి చేయాలన్నారు.  సున్నా శాతం ఖర్చు  చూపిస్తున్న అసిస్టెంటు ఇంజనీర్లకు షోకాజు నోటీసు జారీచేయాలని ఆదేశించారు.  వారంరోజులలో వారికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు పూర్తయిన పనులకు బిల్లులను ఎప్పటి కప్పుడు సమర్పించాలన్నారు.   ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి డా. వెంకటేశ్వర్, పంచాయతీరాజ్ శాఖ  సూపరింటెండెంట్ ఇంజనీరు సుధాకరరెడ్డి,  డ్వామా ప్రోజెక్టు డైరెక్టరు ఇ. సందీప్, జిల్లాలో జరుగుతున్న   పనుల పురోగతిని గూర్చి కలక్టరుకు వివరించారు. ఈ కార్యక్రమంలో  జాయింటు కలెక్టరు గోవిందరాజులు, జిల్లా పంచాయతీ అధికారి వి. కృష్ణవేణి,  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,  అసిస్టెంటు ఇంజనీర్లు, డిఎల్.పి.ఒ.లు పాల్గొన్నారు.