సజావుగా ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక..


Ens Balu
2
Kakinada
2021-03-14 20:09:48

తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గానికి ఆదివారం ఉభయ గోదావరి జిల్లాల్లోని 116 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసి, 91.91 శాతం పోలింగ్ నమోదైందని  రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి తెలియజేసారు. నియోజక వర్గ పరిధిలోని రెండు జిల్లాల్లో నమోదైన మొత్తం 17,467 మంది ఉపాధ్యాయ ఓటర్లుగాను, 16,054 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు. పోలింగ్ సరళి - ఉదయం 10 గంటల సమయానికి 14.5 శాతం, మద్యాహ్నం 12 గం.లకు – 43.6 శాతం, 2గం.లకు – 74.71 శాతం, 4 గం.లకు పోలింగ్ ముగింపు సమయానికి 91.91 శాతం నమోదు జరిగిందన్నారు.  7 పోలింగ్ కేంద్రాలలో నూరు శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని 7 రెవెన్యూ డివిజన్ల పరిధిలో నమోదైన మొత్తం 9720 మంది ఉపాధ్యాయ ఓటర్లుకు గాను,  8823 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోగా జిల్లాలో 90.94 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు.  ఎటపాక డివిజన్ లోని వి.ఆర్.పురం, పెద్దాపురం డివిజన్లోని గండేపల్లి, రాజమహేంద్ర వరం డివిజన్ లోని కోరుకొండ, సీతానగరం పోలింగ్ కేంద్రాలలో నూరు శాతం పోలింగ్ జరిగిందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నమోదైన మొత్తం 7,765 మంది ఉపాధ్యాయ ఓటర్లకు గాను, 7,231 మంది ఓటు హక్కు వినియోగించకోగా, 93.12 శాతం పోలింగ్ నమోదైదన్నారు.  కుక్కునూరు డివిజన్ లోని వేలేరుపాడు, ఏలూరు డివిజన్లోని లింగపాలెం, కొవ్వూరు డివిజన్ లోని ఇరగవరం పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతం పోలింగ్ జరిగిదన్నారు. ఆదివారం జిల్లాలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఈ ఎన్నికల అబ్జర్వర్  ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సందర్శించి, పోలింగ్ ఏర్పాట్లను, సరళిని పరిశీలించారని తెలిపారు.  కలెక్టరేట్లోని వివేకానంద సమావేశ హాలులో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల కమాండ్ కంట్రోల్ రూమ్ నుండి సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ,తూగో సిహెచ్.సత్తిబాబు వెబ్ కాస్టింగ్ విధానంలో పర్యవేక్షించారన్నారు.    ఉభయ గోదావరి జిల్లాల పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బ్యాక్స్ లను అత్యంత  భద్రతా ఏర్పాట్లతో ఆదివారం రాత్రికి కాకినాడ జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించి సాయుధ దళాలు, సిసి కెమేరాల నిఘాతో పటిష్టమైన రక్షణలో ఉంచుతున్నామని జిల్లా కలెక్టర్ మురళీధరెడ్డి తెలిపారు.  ఈ నెల 17వ తేదీ  ఉదయం 7-00 ల నుండి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు.