కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు..
Ens Balu
2
Anantapur
2021-03-15 17:18:40
అనంతపురం జిల్లాలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్ (అసరా, సంక్షేమం) గంగాధర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ప్రపంచ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నేడు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులను జాగృతం చేసే దిశగా ఈ సంవత్సరం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం వాటి సమస్యల పరిష్కా రం అనే అంశంపై కన్జ్యూమర్ ఇంటర్నేషనల్ ప్రకటించిన నేపథ్యంలో వినియోగదారులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యం వల్ల పర్యావరణ వాతావరణం పై ఎక్కువ ప్రభావం, త్రీవ నష్టాలు ఎదుర్కొనవలసి వస్తోందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవులలో కూడా ఆరోగ్య మార్పు అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధాన శైలిని పెంపొందించుకొని మంచి ఆరోగ్యవంత జీవితాన్ని కొనసాగించుకోవాలని పేర్కొన్నారు. ఈ ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టడం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తితో కార్యక్రమాలను ప్రారంభించుకోవాలన్నారు. ప్లాస్టిక్ కాలుష్యా సమస్యలను పరిష్కరించడానికి వినియోగదారుల సంఘాలు, కార్యకర్తలు దృష్టి సారించి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం విజయవంతం కాదని, అందువల్ల ప్రజలు కూడా ప్లాస్టిక్ నిరోధించడానికి సహకరించాలన్నారు. వస్తువులు కొన్న ప్రతి సారి తప్పనిసరిగా బిల్లు తీసుకురావాలని, తూనికలు కొలతలలో మోసపోయినట్లు భావించిన ఎడల లీగల్ మెట్రాలజీ శాఖను సంప్రదించాలని, తద్వారా నష్టపరిహారం పొందుటకు రిజిస్టర్ కాబడిన వినియోగదారుల సంఘాలను లేదా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించవచ్చునని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ నిరోధించడానికి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి సభ్యుల సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజల స్పందన కూడా ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం ప్రజలకు చేరువగా విస్తృతంగా సేవలు అందించడానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో వార్డు సెక్రటరీ ల ద్వారా అనేక సమస్య లు పరిష్కరించబడుతున్నట్లు తెలిపారు. స్పందన లో వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించుటకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా వివిధ వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో పలు విషయాలపై జాయింట్ కలెక్టర్ చర్చించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఆహార కమిటీలు పునరుద్ధరించాలని, అలాగే జిల్లా వినియోగదారుల రక్షణ మండలి, ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని సంఘాల ప్రతినిధులు జెసి దృష్టికి విన్నవించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడి అవసరమైన మేరకు చర్యలు తీసుకుంటామని బదులు జవాబిచ్చారు.
సమావేశంలో కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ క్యాలెండర్ ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురామిరెడ్డి , ఆహార భద్రత అధికారి శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ స్వామి, జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కొండయ్య, రాష్ట్ర వినియోగ దారుల రక్షణ మండలి సభ్యులు షేక్ నబి రసూల్, జిల్లా వినియోగదారుల సంఘం నాయకులు రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.