PMFME ని సద్వినియోగం చేసుకోవాలి..


Ens Balu
4
కాకినాడ
2021-03-15 17:40:58

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ అభియాన్‌, ప్ర‌ధాన‌మంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి ప‌రిశ్ర‌మ‌ల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ ప‌థ‌కం (పీఎం ఎఫ్ఎంఈ) ప‌రిధిలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఆవిష్క‌రించిన ఆహార శుద్ధి విధానం (2020-25) కింద జిల్లాలో సూక్ష్మ ఆహార శుద్ధి రంగ అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్‌, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ జిల్లాస్థాయి క‌మిటీ ఛైర్మ‌న్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. అసంఘ‌టిత విభాగంలోని వ్య‌క్తిగ‌త సూక్ష్మ ఆహార శుద్ధి సంస్థ‌ల పోటీత‌త్వం పెంచ‌డం కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న ప‌థ‌కం, కార్య‌క్ర‌మాల ల‌క్ష్య‌మ‌ని వెల్ల‌డించారు. అదే విధంగా ఇప్ప‌టికే ఉన్న, కొత్త సంస్థ‌ల‌ను అధికారిక చ‌ట్రం కింద‌కు తెచ్చేందుకు కూడా ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. అర్హ‌త క‌లిగిన ప్రాజెక్టు వ్య‌యంలో 35 శాతం వ‌ర‌కు రూ.10 ల‌క్ష‌ల గ‌రిష్ట ప‌రిమితితో రుణ అనుసంధాన క్యాపిట‌ల్ రాయితీ ల‌భిస్తుంద‌ని తెలిపారు. బ్రాండ్ బిల్డింగ్‌, మార్కెటింగ్ మ‌ద్ద‌తు కోసం 50 శాతం వ‌ర‌కు (రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు), మౌలిక వ‌స‌తుల అభివృద్ధి స‌హాయం కింద 35 శాతం వ‌ర‌కు (రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు) స‌హాయం అందుతున్నారు. మ‌హిళా సాధికార‌త‌ను ప్రోత్స‌హించేందుకు  ఏ వ‌ర్గానికి చెందిన మ‌హిళా పారిశ్రామిక‌వేత్త‌ల‌కైనా ప్రాధాన్యం ఉంటుంద‌న్నారు. ఔత్సాహికులు https://pmfme.mofpi.gov.in ద్వారా ఈ నెల 25వ తేదీలోగా ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. మ‌రిన్ని వివ‌రాల‌కు రెవెన్యూ డివిజ‌న్ స్థాయిలోని అధికారిని సంప్ర‌దించొచ్చ‌న్నారు. అమ‌లాపురం (95733 24062), కాకినాడ (90144 72669), పెద్దాపురం (91103 53491), రామచంద్ర‌పురం (80743 48855), రాజ‌మ‌హేంద్ర‌వ‌రం (93816 90044), రంప‌చోడ‌వ‌రం, ఎట‌పాక (95738 47315, 93905 20249), జిల్లాస్థాయి కార్యాల‌యం (0884-2368199) నంబ‌ర్ల‌లో సంప‌ద్రించొచ్చ‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు.