సమాజాభివ్రుద్ధిలో భూగర్భ జలాల శాఖ..
Ens Balu
2
Srikakulam
2021-03-15 17:49:30
సమాజాభివృద్దిలో భూగర్భ జలాలు, జలగణనశాఖ పాత్ర ఎంతో కీలకపాత్ర పోషిస్తోందని ఆ శాఖ డిప్యుటీ డైరెక్టర్ కెఎస్ శాస్త్రి పేర్కొన్నారు. ఈ శాఖ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ ఏడాది స్వర్ణోత్సవ సంవత్సరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 1970వ దశాబ్దానికి పూర్వం ప్రజలు ఎక్కువగా వ్యవసాయం కోసం వర్షాలపైనే ఆధారపడేవారని తెలిపారు. అక్కడక్కడా ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించడంతోపాటుగా, రైతులు బావులు తవ్వుకుని వ్యవసాయం చేసేవారన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలాలను ఒక క్రమపద్దతిలో అన్వేషించి, వాటిని వెలికితీసి రైతాంగానికి మేలు చేయాలన్న లక్ష్యంతో 1971 మార్చిలో ప్రభుత్వం భూగర్భ జలశాఖను ఏర్పాటు చేసిందని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు సమృద్దిగా ఉన్న ప్రాంతాలను, యాక్విఫర్స్‌ను గుర్తించడం, ఎప్పటికప్పుడు జలవనరులను అంచనా వేయడం, భూగర్భ జలాల పరిరక్షణ, నియంత్రణకు తగిన సలహాలను, సూచనలను చేయడం, పరిశీలక బావులను ఏర్పాటు చేయడం,భూగర్భ జలాలను రీఛార్జి చేయాల్సిన ప్రాంతాలను గుర్తించడం, నీటి నాణ్యతను నిర్ధారించడం, సముద్రపు నీరు భూమిలోకి చొచ్చుకురాకుండా తగిన రక్షణ చర్యలను చేపట్టడం తదితర కార్యక్రమాల ద్వారా ఈ 50 ఏళ్ల కాలంలో వ్యవసాయాభివృద్దికి తమ శాఖ ఎంతగానో కృషి చేసిందని తెలిపారు. అదేవిధంగా జీవనధార, జెఆర్‌వై, మిలియన్ వెల్స్ ప్రోగ్రామ్, సన్నచిన్నకార రైతులకు బోరుపాయింట్ సర్వే, వివిధ సంక్షేమ శాఖల పధకాల్లో భాగంగా బోరు పాయింట్లు గుర్తించడం, చెక్‌డ్యాములు, ఊట చెరువుల నిర్మాణానికి సర్వే చేయడం మొదలగు సమాజాభివృద్ది కార్యక్రమాలను నిర్వహించిందని తెలిపారు. స్వర్ణోత్సవాల నేపథ్యంలో భూగర్భ జలాల సంరక్షణ, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించేందుకు మంగళవారం నుంచి వారోత్సవాలను నిర్వహిస్తున్నామని, వాటిని విజయవంతం చేయాలని శాస్త్రి కోరారు.