స్పందనకు వినతుల వెల్లువ..
Ens Balu
3
Srikakulam
2021-03-15 20:13:41
శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో డయల్ యువర్ ఫోన్ ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా బూర్జ మండలం తోటవాడ నుండి బి.శ్రీనివాసరావు ఫోన్ చేసి మాట్లాడుతూ తమ గ్రామంలో డప్పు కళాకారుల పింఛనుతో పాటు వృద్ధాప్య పింఛనును కూడా కొందరు పొందుతున్నారని, కావున దానిపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. సంతకవిటి మండలం మామిడిపల్లి నుండి కె.గోపాలరావు మాట్లాడుతూ మడ్డువలస రిజర్వాయర్ నుండి 10 శాతం నీటిని మాత్రమే విడుదల చేయాల్సి ఉండగా , ఎక్కువగా నీటిని విడుదల చేస్తున్నారని, దానివలన అవసరమైనపుడు నీటి నిల్వలు ఉండబోవని ఫిర్యాదు చేసారు. మెళియాపుట్టి మండలం దుబ్బలాపురం నుండి జి.తిరుపతిరావు ఫోన్ చేస్తూ తన వద్ద 130 ధాన్యం బస్తాలు ఉన్నాయని, మిల్లర్లు వాటిని కొనుగోలు చేసి డబ్బులు మంజూరుచేయాలని కోరారు. వీరఘట్టం మండలం హుస్సేన్ పురం నుండి దాలినాయుడు మాట్లాడుతూ తన భూమిని సబ్ డివిజన్ చేసి భూమి ఇప్పించాలని కోరారు. వజ్రపు కొత్తూరు మండలం పాత టెక్కలి నుండి బి. రామారావు ఫోన్ చేస్తూ తనకు రేషన్ మంజూరుకావడం లేదని, కావున దానిని మరల పునరుద్దిరించాలని కోరారు. జలుమూరు మండలం సైరిగాం నుండి పి. రామారావు మాట్లాడుతూ తన 4 ఎకరాల భూమికి చెందిన మ్యూటేషన్ మంజూరుచేయాలని కోరారు. పాలకొండ నుండి బి.రాంబాబు ఫోన్ చేసి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో తాను ఏర్పాటుచేసిన షామియానాల బిల్లు ఇంతవరకు మంజూరు కాలేదని, దానిపై తగు చర్యలు తీసుకొని బిల్లును మంజూరుచేయాలని ఫిర్యాదు చేసారు. మెళియాపుట్టి మండలం కొసమాల నుండి ఎ.చిట్టిబాబు మాట్లాడుతూ తనకు చెందిన భూమిలో గ్రామ సచివాలయం బిల్డింగ్ నిర్మాణం చేపడుతున్నారని, కావున దానిని నిలుపుదల చేయాలని ఫిర్యాదు చేసారు. పొందూరు మండలం వల్లపేట నుండి యం.వెంకటరావు మాట్లాడుతూ తన గ్రామంలో రహదారి ఆక్రమణకు గురైందని, కావున బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు. నరసన్నపేట నుండి జి.మన్మథరావు ఫోన్ చేస్తూ ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట నిర్వహించాలని కోరారు. ఎచ్చెర్ల మండలం ధర్మవరం నుండి వై.నారాయణమ్మ మాట్లాడుతూ తనకు 2018లో రావలసిన గృహనిర్మాణపు బిల్లు ఇంతవరకు మంజూరుకాలేదని, కావున మంజూరుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.