భూసేకరణ వేగవంతం చేయండి..
Ens Balu
1
Vizianagaram
2021-03-15 20:16:55
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన భూసేకరణను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్(రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్ ఆదేశించారు. ఎయిర్‌పోర్టు భూసేకరణపై కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జెసీ కిశోర్ సోమవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏ.రావివలస, గూడెపువలస, కంచేరు, రావాడ, సవరివిల్లి తదితర గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణపై గ్రామాలవారీగా సమీక్షించారు. ఎయిర్‌పోర్టు ఎప్రోచ్ రోడ్డు, ట్రంపెట్ బ్రిడ్జికి కావాల్సిన భూసేకరణపై ఆరా తీశారు. విమానాశ్రయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, నిర్ధిష్ట కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. వివాద రహితంగా ఉన్న భూమిని త్వరగా సేకరించాలన్నారు. యుద్దప్రాతిపదికన రెండు రోజుల్లో సబ్‌డివిజన్ పూర్తి చేయాలని సర్వేశాఖను జెసి ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కెబిటి సుందరి, హెచ్‌వి జయరామ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ పప్పు రవి, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, ట్రాన్స్‌కో ఎస్ఇ వై.విష్ణు, ఉద్యానశాఖ ఎడి ఆర్.శ్రీనివాసరావు, సర్వేశాఖ ఏడి పివిఎన్ కుమార్, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.