ప్లాస్టిక్ నియంత్రణతో జీవ కోటి మనుగడ..
Ens Balu
1
Vizianagaram
2021-03-15 20:44:13
సగటు పౌరుడిగా.. వినియోగదారుడిగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని సంయుక్త కలెక్టర్ జి.సి. కిశోర్ కుమార్ పేర్కొన్నారు. "ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం" అని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వి.టి.అగ్రహారంలోని మహిళా ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి వినియోదారుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. తద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయగలమని పేర్కొన్నారు. రోజువారీ వినియోగంలో భాగంగా వివిధ వస్తువులు కొంటుంటామని, మోసాలకు గురి కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. ఒక మంచి పని అనేది మన నుంచే ప్రారంభం కావాలి.. దానికి ఈ రోజు నుంచే కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడటంలో భాగస్వాములవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్‌వో ఎం. పాపారావు, డిప్యూటీ డీఎం&హెచ్‌వో ఎస్. రమణారావు, లీగల్ మెట్రాలజీ విభాగ డిప్యూటీ కంట్రోలర్ ఎన్. జనార్ధన్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ ఈశ్వరి, విజయనగరం తహశీల్దార్ ప్రభాకర్, సివిల్ సప్లై డీటీ జగన్, జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం ఇన్‌ఛార్జి చదలవాడ ప్రసాద్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.