సహకార సంఘాల బలోపేతానికి కృషి..
Ens Balu
2
Vizianagaram
2021-03-15 20:45:22
వీలైనంత మేర సభ్యత్వాలను ఎక్కువ సంఖ్యలో నమోదు చేయటం ద్వారా సహకార సంఘాల బలోపేతానికి కృషి చేయాలని జేసీ కిశోర్ కుమార్ పిలుపునిచ్చారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికతను ఆహ్వానించి, సేవలను సులభతరం చేయాలని పేర్కొన్నారు. సహకార సంఘాల భవిష్యత్తు కార్యాచరణపై సమీక్షించే నిమిత్తం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో జేసీ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో సహకార సంఘాలను బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమష్టి బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ఇప్పుడున్న 1,38,296 సభ్యత్వాల సంఖ్యను మరింత పెంచాలన్నారు. సహకార సంఘాలు ఆర్థిక లబ్ధి కోసం కాకుండా రైతుల శ్రేయస్సు కోసం పని చేయాలని పేర్కొన్నారు. ఒక వైపు ఆర్థికంగా నిలదొక్కుకుంటూ.. మరో పక్క రైతులకు ఉన్నతంగా సేవలందించాలని హితవు పలికారు. సభ్యత్వాల నమోదు విషయంలో నిజమైన రైతులకు అవకాశం కల్పించి ప్రయోజనాలు కల్పించాలని చెప్పారు. రాజకీయపరమైన ఉద్దేశంతో సమూహాలను తీసుకొచ్చి సభ్యత్వాలు ఇవ్వాలని ఎవరు కోరినా.. సున్నితంగా తిరస్కరించాలన్నారు. రుణాల మంజూరు విషయంలో సులభతర విధానాలను అనుసరించాలని సూచించారు. సేవలను త్వరగా.. కచ్చితంగా ఇవ్వాలంటే సాంకేతికత పద్ధతులను అవలంబించాలని చెప్పారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రికార్డులను, ఇతర జాబితాలను కంప్యూటరీకరణ చేయాలని, అప్పుడు పర్యవేక్షణ, సమీక్షలు చేసేందుకు ప్రయాసలు పడాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. రుణాల మంజూరు, రుణాల సేకరణ, ఆడిట్, ఇతర వ్యయ, ఆదాయ వివరాలను డిజిటలైజేషన్ రూపంలో పొందుపరచాలని సూచించారు. సహకార సంఘాల్లో సభ్యత్వానికి ఎంట్రీ ఫీజుతో కలిపి రూ.330 చెల్లించాల్సి ఉంటుందని, దాని ఆధారంగానే భవిష్యత్తులో ప్రయోజనాలు కల్పించడానికి వీలవుతుందని జిల్లా కో-ఆపరేటివ్ అధికారి ఎస్. అప్పలనాయుడు తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ బ్యాంకు సీఈవో జనార్థన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.