నిరుద్యోగ యుతకు ఆన్లైన్లో ఉచితర కోర్సులు..సెట్ శ్రీ


Ens Balu
4
Srikakulam
2020-08-21 20:13:46

యువతకు ఆన్ లైన్ కోర్సులను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ చర్యలు చేపట్టిందని యువజన సర్వీసుల శాఖ (సెట్ శ్రీ) ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న నైపుణ్యాలు వెలికితీయడం, వారిలో వ్యక్తిత్వ వికాసాలను పెంపొందిచడం, యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జిల్లాలోని 15 నుండి 29 సం.ల మధ్య వయస్సు కలిగిన యువతీ, యువకులకు అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఉచిత యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ లో అంతర్జాలము వేదికగా ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలలో భాగంగా ప్రతీ రోజు యోగా, ధ్యానం కోర్సులు నిర్వహిస్తారని, మిగిలిన అంశములను వారంలో ఒక రోజు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు యండమూరి వీరేంద్రనాథ్, బి.వి. పట్టాభిరామ్, గంపా నాగేశ్వరరావు తదితరులు నిర్వహిస్తారని వివరించారు. ఆసక్తి, అర్హత గల యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యక్తిత్వ వికాసాన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందంచుకోవాలని శ్రీనివాస రావు కోరారు. అభ్యర్ధులు తమ వివరాలు - పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, ప్రస్తుత స్థితి, చిరునామా, మొబైల్ నెంబరు, ఈ మెయిల్ ఐడి, ఆధార్ నంబరు, శిక్షణ పొందుటకు ఆసక్తిగల అంశంను ఒక కాగితంపై రాసి పాస్ పోర్ట్ సైజు ఫోటో అతికించి, సంతకం చేసిన దరఖాస్తును స్కాన్ లేదా పి.డి.యఫ్ చేసి setsrisklm@gmail.com  మెయిల్ అడ్రస్ నకు ఈ నెల 25 వ తేది లోగా పంపించాలని శ్రీనివాసరావు తెలిపారు. ఉచిత కోర్సుల వివరాలపై సందేహాలు, వివరాలకు కార్యాలయం పని దినములలో సెట్ శ్రీ మేనేజరు బి.వి. ప్రసాదరావు (8341478815,  08942 240601) ఫోన్ నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
సిఫార్సు