సైకిల్ యాత్ర విజయవంతం కావాలి..


Ens Balu
2
Srikakulam
2021-03-16 19:39:23

రెడ్ క్రాస్ సంస్థ శత జయంతి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో ప్రారంభమైన సైకిల్ యాత్ర విజయవంతం కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆశాభావం వ్యక్తం చేసారు. రెడ్ క్రాస్ సంస్థ శత జయంతిని పురష్కరించుకొని స్థానిక 80 అడుగుల రహదారి వద్ద సైకిల్ యాత్ర కార్యక్రమాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మంగళవారం ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ ఏ.శ్రీధర్ రెడ్డితో కలిసి  సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ వంద సంవత్సరాల ఉత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. సేవా ధృక్పథంతో పనిచేయడంలో రెడ్ క్రాస్ సంస్థ ముందంజలో ఉంటుందని కొనియాడారు. ముఖ్యంగా  కోవిడ్ సమయంలో రెడ్ క్రాస్ సంస్థ వాలంటీర్లు అందించిన సేవలు అనిర్వచనీయమని, సేవా దృక్పథంతో అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. ముఖ్యంగా కోవిడ్ తో మృతిచెందిన వారిని వారి బంధువులు సైతం ముందుకురాని సమయంలో రెడ్ క్రాస్ వాలంటీర్లు స్వచ్చంధంగా ముందుకు వచ్చి వారి అంత్యక్రియలు నిర్వహించిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. అలాగే వలస కార్మికులు భోజనాలు లేకుండా ఉన్న సమయంలో భోజనాలు అందించారని చెప్పారు. కోవిడ్  పేషెంట్ల కొరకు ప్లాస్మా అవసరమని జిల్లా ప్రజలకు పిలుపునివ్వగా రెడ్ క్రాస్ ముందు వరుసలో ఉండి ప్లాస్మాదానం చేసారని కలెక్టర్ తెలిపారు. ఇవేకాకుండా హోమ్ ఐసోలేషన్లో ఉండే కోవిడ్ పేషెంట్లకు మెడికల్ కిట్లు అందజేశారని కొనియాడారు. రక్తదానం చేయడంలోనూ, రక్తదానం సేకరించడంలోనూ రెడ్ క్రాస్ సంస్థ ముందంజలో ఉంటుందని చెప్పారు. రెడ్ క్రాస్ సంస్థ ఇటువంటి కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలను కూడా విజయవంతంగా నిర్వహిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఇన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నట్లే ఈ సైకిల్ యాత్ర కూడా విజయవంతం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  అమిత్ బర్దార్ మాట్లాడుతూ జిల్లాలో రక్తం కొరత ఎక్కువగా ఉందని, అత్యవసరాలకు సరిపడా రక్తనిధి నిల్వలు లేవని, కావున యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వలన మరింత ఆరోగ్యంగా ఉంటారని గుర్తుచేసారు. రక్తదానంపై చాలామందికి అపోహలు ఉన్నాయని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు ప్రతీ 6 మాసాలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని యస్.పి తెలిపారు. రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ ఏ.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో క్యాన్సర్ ఆసుపత్రి లేదని, త్వరలో శ్రీకాకుళంలో  క్యాన్సర్ హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రెడ్ క్రాస్ సంస్థ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సైకిల్ యాత్రను ప్రారంభించడం జరిగిందని, సైకిల్ యాత్రలో అందరూ పాల్గొనవచ్చని చెప్పారు. సైకిల్ యాత్ర ఈ నెల 25వరకు కొనసాగుతుందని, ఈ యాత్రలో పాల్గొన్నవారందరికీ ఈ నెల 25న అమరావతిలో గౌరవ రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రసంశా పత్రాలను అందజేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రదేశాల్లో యాత్రా సభ్యులతో సభలు నిర్వహించి రక్తదానం, పరిసరాల పరిశుభ్రత, మొక్కలు నాటడం, మోటారు వాహనాల వినియోగం తగ్గింపు, కరోనా నివారణ చర్యలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేయడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ సైకిల్ యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర రెడ్ క్రాస్ ఉపాధ్యక్షుడు పి.జగన్మోహన్ రావు, రాష్ట్ర రెడ్ క్రాస్ ట్రెజరర్ వెంకటేశ్వరరావు , సంయుక్త కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు,  డా.డి.విష్ణుమూర్తి, స్వచ్ఛంధ సంస్థల డైరక్టర్లు గీతా శ్రీకాంత్, నూక సన్యాసి రావు, రమణ మూర్తి, ఎం. ప్రసాద రావు, సామాజిక కార్యకర్త మంత్రి వెంకట స్వామి, ఫణి, డా.శ్రీరాములు, ఇంటాక్ కన్వీనర్ కె. వి. జె. రాధా ప్రసాద్, సురంగి మోహన్ రావు, నిక్కు అప్పన్న, బలివాడ మల్లేశ్వర రావు, గేదెల ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 
సిఫార్సు