ఎమ్మెల్సీ కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి..


Ens Balu
3
Kakinada
2021-03-16 20:02:16

తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికలకు రేపు నిర్వహించబోయే కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేపట్టామని సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు తెలియజేశారు.  స్థానిక జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను సహాయ రిటర్నింగ్ అధికారి (ఏఆర్ఓ), డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు మంగళవారం పర్యవేక్షించారు.  ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులకు కౌంటింగ్ ఏర్పాట్లపై వివరిస్తూ, ఈ నెల 14వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగగా, మొత్తం 17,467 మంది ఓటర్లకు గాను, 16,054 మంది (91.91 శాతం) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.  ఈ ఎన్నికల బరిలో మొత్తం 11 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారని, రెండు జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను జెఎన్టియూ ఇంజనీరింగ్ కళాశాలలోని ఐఈటిఈ బ్లాకులో స్ట్రాంగ్ రూమ్ లో పటిష్టమైన రక్షణలో బద్రపరచడం జరిగిందన్నారూ.  బుధవారం ఉదయం 8 గం.ల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని, ఇందుకు 136 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించామన్నారు.  కౌంటింగ్ సిబ్బందితో పాటు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు మంగళవారం ఓట్ల లెక్కింపు విధానంపై అవగాహన కల్పించామని తెలిపారు. కౌంటింగ్ నిర్వహణకు మొత్తం 10 టేబుళ్లు ఏర్పాటు చేశామని, ప్రాధమిక కౌంటింగ్ కు 12 రౌండ్లు, ప్రధాన కౌంటింగ్ కు 2 రౌండ్లు అవసరమౌతాయన్నారు. తొలుత బ్యాలెట్లన 25 చొప్పున కట్టలు కడతారని తెలిపారు.  మిగిలిన ఎన్నికలకు భిన్నంగా ప్రిఫరెన్సియల్ ఓటింగ్ విధానంలో జరిగే ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు, అవసరమైనపుడు బదిలీ ద్వారా తదుపరి ప్రాధాన్యతా ఓట్లకు కూడా లెక్కించడం జరుగుతుందన్నారు.  మొత్తం పోలైన ఓట్లలో వాలిడ్ ఓట్లను రెండుతో భాగించగా వచ్చిన సంఖ్యకు ఒకటి కలిపి విజేతను నిర్ణయించేందుకు అవసరమైన కోటా సంఖ్యను నిర్థారించడం జరుగుతుందన్నారు.  ఎవరేని ఒక అభ్యర్థికి నిర్థేశిత కోటా సంఖ్య ఓట్లు వచ్చే వరకూ ఎలిమినేషన్ రౌండ్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారని తెలిపారు.  కొవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.  అభ్యర్థులు, వారి ఏజెంట్లు సకాలంలో కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, తమ వెంట సెల్ ఫోన్ లు, ఏ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు లోనికి తీసుకు రాకూడదని తెలిపారు. కౌంటింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు మీడియా కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు.  కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా రాత్రి వరకూ కూడా కొనసాగితే ఇబ్బంది లేకుండా అంతరాయం లేని విద్యుత్ సరఫరా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేశామన్నారు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుందన్నారు.   ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.