శిల్పారామంలో హస్తకళల ఎక్స్‌పో..
Ens Balu
2
Kakinada
2021-03-16 20:42:49
కాకినాడలోని ఎన్‌టీఆర్ బీచ్ పార్కు పక్కనున్న శిల్పారామంలో హస్తకళల ఎగ్జిబిషన్-2021, ప్రత్యేక చేనేత వస్త్రాల ఎక్స్‌పో-2021ను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ శిల్పారామం సీఈవో బి.జయరాజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎగ్జిబిషన్, ప్రత్యేక ఎక్స్‌పోను మార్చి 17న సాయంత్రం అయిదు గంటలకు జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమానికి విజయవాడలోని హస్తకళల అభివృద్ధి కార్యాలయ ఏడీ డా. మనోజ్ లంకా ప్రత్యేక అతిథిగా హాజరవుతారన్నారు. మార్చి 17 నుంచి 26 వరకు హస్తకళల ఎగ్జిబిషన్, మార్చి 30 వరకు ప్రత్యేక చేనేత వస్త్రాల ఎక్స్‌పో సెలవు రోజులతో సహా ప్రతి రోజూ ఉదయం 11 గం. నుంచి రాత్రి 9 గం. వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్, ఎక్స్‌పోలో కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, ఉదయగిరి కట్‌లరీ ఉడెన్ వస్తువులు, బంజారా చేతి ఎంబ్రాయిడరీ తదితర హస్తకళల ఉత్పత్తులతో పాటు మంగళగిరి, వెంకటగిరి రీ, చీరాల, మచిలీపట్నం, ఉప్పాడ తదితర చేనేత చీరలు, డ్రస్ మెటిరీయల్ ప్రదర్శన, అమ్మకాలు ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్, ఎక్స్‌పోలను కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేస్తున్నట్లు బి.జయరాజ్ తెలిపారు.