దేశం కోసం ప్రతీ ఒక్కరూ పాటు పడాలి..


Ens Balu
3
Anantapur
2021-03-16 20:47:26

ఎందరో మహానుభావులు మన దేశానికి స్వాతంత్రం సిద్ధించేందుకోసం సర్వం త్యాగం చేశారని, వారి త్యాగ ఫలాలను గుర్తుంచుకుని దేశం కోసం మనమేం చేస్తున్నామో అనేది ఆలోచించాలని, దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్ లో నెహ్రూ యువ కేంద్రం మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 75 వ స్వాతంత్ర్య భారత సంబరాల్లో భాగంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ, టవర్ క్లాక్ వద్ద మానవ హారం కార్యక్రమాన్ని మరియు దేశంలో రెడ్ క్రాస్ సంస్థ ప్రారంభించి 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వాకథాన్, సైక్లథాన్ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ భరతమాతను విదేశీ పాలనను విముక్తి చేయడానికి చాలామంది తమ ఆస్తులు, ప్రాణాలు, కుటుంబ సభ్యులను పోగొట్టుకుని నిలబడి త్యాగాలను చేయడంవల్ల మనకు స్వతంత్రం సిద్ధించిందని, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, నెహ్రు తదితర అమరవీరుల త్యాగాల వల్ల మనకు స్వతంత్రం వచ్చిందన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతోందని, ఈ సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని, స్వతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరిని తలుచుకుంటూ వారికి ఘన నివాళి అర్పిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినప్పుడే మహానుభావులు చేసిన త్యాగాలకు విలువ ఉంటుందని, ఏదో విధంగా దేశానికి మంచి చేసి గౌరవం తీసుకురావాలన్నారు. దేశంలో 1920వ సంవత్సరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని ప్రారంభించడం జరిగిందని, అప్పటినుంచి ఇప్పటివరకు వందేళ్లలో రెడ్ క్రాస్ సంస్థ ఎంతో సేవ చేయడం జరిగిందన్నారు. మానవ జాతికి సేవ చేయాలి, మానవత్వాన్ని వికసింపజేయాలని, మానవజాతి మనుగడకు రెడ్ క్రాస్ సంస్థ కృషి చేస్తోందని, కరోనా సమయంలో ఎంతో సేవ చేయడం జరిగిందని, రక్తదానం చేసి ప్రజల ప్రాణాలు కాపాడుతోందన్నారు. జిల్లా యంత్రాంగం కూడా తమకు ఎంతగానో సహకారం అందిస్తోందన్నారు.  ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ ఎంతోమంది త్యాగమూర్తులు సర్వం త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చారన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో మంచి సమాజాన్ని ఇవ్వడం కోసం, సమాజాన్ని కాపాడుకోవడం కోసం, విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాల్లో పాలుపంచుకునేలా చేసి అవగాహన కల్పించాలన్నారు. దేశం మనకేమిచ్చింది అనేది కాకుండా దేశానికి మనం ఎలాంటి సేవ చేస్తున్నామని పిల్లలు మరిచిపోతున్నారని, ప్రతి ఒక్కరు దేశ సేవ చేయాలన్నారు. అలాగే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్థాపించి 100 ఏళ్లు అయిన సందర్భంగా ఎన్జీవోలు విద్యార్థులతో సైకిల్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందని, కులానికి, మతానికి, వర్గానికి అన్నింటికీ అతీతంగా రెడ్ క్రాస్ సేవలు ఉంటున్నాయన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు, చెట్ల పెంపకం ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా) గంగాధర్ గౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. స్వతంత్రం సిద్ధించింది అనేందుకు గుర్తుగా నిర్మించిన టవర్ క్లాక్ వద్ద ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మానవహారం చేయడం జరిగిందని, స్వాతంత్ర్య ఫలాలు ప్రతి ఒక్కరికి సిద్ధించి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ఈ సందర్భంగా ఆజాదీ కీ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంపై విద్యార్థులు జాతీయ జెండా తీసుకొని అవగాహన ర్యాలీ, టవర్ క్లాక్ వద్ద మానవ హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద నుంచి సప్తగిరి సర్కిల్ కె ఎస్ ఆర్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, తెలుగు తల్లి విగ్రహం, రుద్రంపేట, కళ్యాణ్ దుర్గం బైపాస్, పి టి సి ఫ్లైఓవర్, ఆర్ట్స్ కళాశాల వరకు విద్యార్థుల సైకిల్ ర్యాలీ నిర్వహించారు.