రెడ్‌క్రాస్ లక్ష్యాలను సాధించాలి..
Ens Balu
4
Vizianagaram
2021-03-17 14:23:35
రెడ్‌క్రాస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీని, జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ బుధవారం కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. రెడ్‌క్రాస్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. ఈ నెల 16న శ్రీకాకుళం జిల్లాలో మొదలైన ఈ సైకిల్ ర్యాలీ, విజయనగరం మీదుగా బుధవారం సాయంత్రానికి విశాఖపట్నం చేరుకుంటుంది. రెడ్‌క్రాస్ స్థాపన వెనుక ఉన్న ఏడు ప్రధాన లక్ష్యాలను ఈ ర్యాలీలో వివరిస్తారు. ముఖ్యంగా రక్తదానం, మొక్కల పెంపకం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు మాట్లాడుతూ, వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా రెడ్‌క్రాస్ లక్ష్యాలను వివరించేందుకు, వివిధ అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమలో సైకిల్ ర్యాలీ ఒకేసారి మొదలయ్యిందని, ఈ నెల 25 నాటికి విజయవాడ చేరుకుంటుందని తెలిపారు. ఆరోజు జరిగే ముగింపు కార్యక్రమానికి గవర్నర్ హాజరవుతారని చెప్పారు. సమాజంలో సేవాతత్వాన్ని పెంపొందించేందుకు, ముఖ్యంగా రక్తదానాన్ని ప్రోత్సహించేందుకు రెడ్ క్రాస్ విశేషంగా కృషి చేస్తోందని చెప్పారు. ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో భాగస్వాములు అయినందుకు రెడ్‌క్రాస్ సభ్యులు గర్వపడాలని అన్నారు. రెడ్‌క్రాస్ లక్ష్యాలను సాధించేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని జెసి కోరారు.
కార్యక్రమంలో రెడ్‌క్రాస్ స్టేట్ ఛైర్మన్ డాక్టర్ ఏ.శ్రీధర్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ జగన్మోహనరావు, కోశాధికారి డాక్టర్ వెంకటరెడ్డి, జిల్లాశాఖ ఛైర్మన్ కెఆర్‌డి ప్రసాదరావు, కార్యదర్శి సత్యం, జూనియర్ రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త ఎం.రామ్మోహనరావు, రెడ్‌క్రాస్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీకాంత్, ఎన్‌సిసి జిల్లా కో-ఆర్డినేటర్ కల్నల్ అజయ్‌కుమార్, బాలల హక్కుల కమిషన్ సభ్యులు కేసలి అప్పారావు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రతినిధులు ఇ.విజయ్‌కుమార్, రెడ్‌క్రాస్ ఎపిఆర్ఓ ఎం.రాము, డిఎఫ్ఓ పి.గౌరి, ఎన్.చంద్రరావు, డాక్టర్ వెంకటేశ్వర్రావు, డాక్టర్ ఎన్‌వి సూర్యనారాయణ, డాక్టర్ సుభద్రదేవి, అచ్చిరెడ్డి తదితర ప్రముఖులు, పలువురు రెడ్‌క్రాస్ శాశ్వత సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.