భూగర్భజల మట్టం లోతు పరిశీలన..
Ens Balu
2
Srikakulam
2021-03-17 14:42:38
పీజో మీటర్ల ద్వారా భూగర్భ జల మట్టం లోతు పరిశీలిస్తున్నామని భూగర్భ జలం, జల గణన శాఖ ఉపసంచాలకులు సి.ఎస్.రావు అన్నారు. భూగర్భ జలం, జల గణన శాఖ స్వర్ణోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ఉప సంచాలకుల కార్యాలయంలో బుధ వారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పీజోమీటరు ద్వారా భూగర్భ జలమట్టం ఎంత లోతులో వుందో తెలుసుకోటానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బోరు బావి వంటిదని అన్నారు. పీజోమీటర్లను రాష్ట్రంలో భూగర్భజల పరిస్థితిని ప్రతిబింబించేలా నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు సహకారంతో 1254 ప్రాంతాల్లో ఏర్పాటు చేయగా జిల్లాలో 68 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రాతి పొరల్లో వున్న భూగర్భ జలం ఎంత పరిమాణంలో వుందో తెలుసుకోవటంతో పాటు బావులు లేదా బోరు బావులలో ఎంత లోతులో వుందో తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉందన్నారు. భూగర్భ జల లభ్యతా పరిమాణం ఎంత ముఖ్యమో అది అందుబాటులో వుండే లోతు కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ ఎండా కాలంలో బావులు లేదా బోర్లలో నీళ్లు బాగా క్రింది స్ధాయిలో ఉంటాయని, వానాకాలంలో పైకి వస్తాయని అందరికీ తెలిసిన విషయమే అయినా అవి ఖచ్చితంగా ఏ కాలంలో ఎంత లోతులో వున్నాయి, కాలానుగుణంగా ఏ రకమైన మార్పులకు లోనవుతున్నాయి అని శాస్త్రీయంగా తెలుసుకొనుటకు పిజో మీటర్లు ఉపయోగపడతాయని వివరించారు. పీజోమీటర్ల ద్వారా తమ ప్రాంతంలోని వాటర్ లెవల్ ను ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్ ఫోన్ ద్వారా ఎవరైనా తెలుసుకోవచ్చుని, ఇంటర్ నెట్ సౌకర్యం కలిగిన మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్లో http://www.apwrims.ap.gov.in, http://www.apsgwd.ap.gov.in వెబ్ సైట్ల ద్వారా మరియు సి.యం. డ్యాష్ బోర్డు (https://core.ap.gov.in) ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో వాటర్ లెవల్ 2020-21 జల సంవత్సరంలో కురిసిన వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా గ్రౌండు వాటర్ లెవల్ బాగా పెరిగిందని, 2020 జూన్ నుండి ప్రారంభమైన నైరుతి ఋతుపవన వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ఇప్పటి వరకు 787 మి.మీ. వర్షం కురవాల్సి వుండగా 1017 మి.మీ. వర్షం కురిసిందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 6.3 మీటర్ల లోతులో నీటి నిల్వల స్ధాయి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూగర్భ జల శాఖ సహయ సంచాలకులు డి.లక్ష్మణ రావు, జిల్లా నీటియాజమాన్య సంస్ధ సహాయ సంచాలకులు ఏ.లక్ష్మణ రావు, టెక్నికల్ అసిస్టెంట్ ఏ.జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు.