ఆర్బీకేల్లో సీహెచ్సీ కేంద్రాల ఏర్పాటు..
Ens Balu
3
కాకినాడ
2021-03-17 15:47:35
తూర్పుగోదావరి జిల్లాలో 1,094 రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ యంత్రాల కస్టమ్ హైరింగ్ కేంద్రాల (సీహెచ్‌సీ)ను ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కోర్టుహాల్‌లో వ్యవసాయ యంత్రాల సరఫరా సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులతో జేసీ సమావేశమయ్యారు. అదే విధంగా వర్చువల్ విధానంలో అన్ని డివిజన్లలోని ఏడీలతో పాటు మండల స్థాయి వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసాయ సహాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధునిక యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని, గ్రామాల్లో రైతులకు అవసరమైన అన్ని అధునిక యంత్రాలను అందుబాటులో ఉంచేందుకు ఒక్కో కేంద్రంలో గరిష్టంగా రూ.15 లక్షల విలువైన యంత్రాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. కేంద్రాల ఏర్పాటుకు 1094 రైతు గ్రూపులను ఇప్పటికే గుర్తించామని, ఒక్కో గ్రూపులో అయిదుగురు రైతులు సభ్యులుగా ఉంటారన్నారు. ప్రభుత్వం 40 శాతం రాయితీని అందిస్తుందని, 50 శాతం బ్యాంకు రుణం మంజూరవుతుందని తెలిపారు. రైతు గ్రూపులు 10 శాతం మొత్తాన్ని భరిస్తే సరిపోతుందని వివరించారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని వచ్చే నెలలో గౌరవ ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ క్రమంలో సరఫరా చేయగల యంత్రాలు, ధరలు వివరాలతో పూర్తివివరాలను అందించాలని, రైతులకు గరిష్ట ప్రయోజనం కల్పించేలా నాణ్యమైన, అధిక ఉత్పాదకత కలిగిన యంత్రాలను అందించాలని యంత్రాల సరఫరా సంస్థల ప్రతినిధులకు జేసీ సూచించారు. గ్రూపులకు సంబంధించి ఖాతాలను తెరవడం, డీబీటీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్, ఏడీ నుంచి పర్మిట్ల జారీ తదితర పనులను ఈ నెల 25 నాటికి పూర్తిచేయాలని వ్యవసాయ అధికారులను జేసీ ఆదేశించారు.
నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు..
రైతులకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ఫలాలను అందించే క్రమంలో క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంవహిస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులకు అందుబాటులో ఉండి, కీలకంగా వ్యవహరించాలన్నారు. అత్యంత కచ్చితత్వంతో మార్చి 20 నాటికి 100 శాతం ఈ-క్రాప్ బుకింగ్‌ను పూర్తిచేయాలన్నారు. రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు తప్పులు లేకుండా చూడాలన్నారు. మద్దతు ధర, పంట ప్రమాణాల వివరాలను ప్రతి ఆర్‌బీకేలోనూ ప్రదర్శించాలని, ధాన్యం సేకరణతో పాటు ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎస్‌వీ ప్రసాద్, డీడీలు రామారావు, మాధవరావు, డీసీసీబీ డీజీఎం పీఎస్ ప్రకాశం తదితరులతో పాటు వ్యవసాయ యంత్రాల సరఫరా సంస్థలు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.