అనంతలో మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
4
Anantapur
2021-03-17 17:59:44
రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 18వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక చేపట్టేందుకు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. బుధవారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నికపై జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన అనంతపురం నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ లతోపాటు జిల్లాలోని గుత్తి, కళ్యాణదుర్గం, మడకశిర, పుట్టపర్తి, రాయదుర్గం, ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, హిందూపురం, కదిరి మునిసిపాలిటీ లలో చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నిక కోసం ప్రిసైడింగ్ అధికారులను నియమించామని, వారి ఆధ్వర్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక చేపట్టడం జరుగుతుందన్నారు. కలెక్టర్ అనంతపురం మేయర్, ఉప మేయర్ ఎన్నిక, జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ ) హిందూపురం మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారన్నారు. ఎన్నికల పరిశీలకులు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి ) తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను పర్యవేక్షిస్తారన్నారు..మిగిలిన అన్ని మునిసిపాలిటీ ల్లో మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికలను ఆయా ప్రిసైడింగ్ అధికారులు నిర్వహిస్తారన్నారు
ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తకూడదన్నారు. అందుకనుగుణంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిసైడింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకొని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నియమ నిబంధనల ప్రకారం ఎన్నిక ప్రక్రియ నిర్వహించాలన్నారు..ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగకూడదన్నారు.. ప్రణాళికాబద్ధంగా ఎన్నిక పూర్తి చేయాలన్నారు. కౌన్సిల్ హాల్ లో సీటింగ్ ఏర్పాట్లు జాగ్రత్తగా చేపట్టాలన్నారు.. వీడియో కెమెరాలు, సిసి టీవీ లు ఏర్పాటు చేయాలన్నారు.ఎన్నిక ప్రక్రియ లో నియమ నిబంధనలు గురించి కలెక్టర్ కూలంకషంగా వివరించారు
టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ ) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి ) ఏ.సిరి, ఆర్డీవోలు, ప్రిసైడింగ్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, డిఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.