భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి..


Ens Balu
5
Anantapur
2021-03-17 18:55:18

అనంతపురం జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూమికి సంబంధించి భూసేకరణ ప్రక్రియను నిర్దేశించిన గడువు లోవు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ మీటింగ్ హాల్లో హెచ్ ఎల్సి, హెచ్ ఎన్ ఎస్ ఎస్, పిఎబి ఆర్, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎపిఐఐసి తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిపై ఆర్డీవోలు, ఇంజనీర్లు, భూసేకరణ డిప్యూటీ కలెక్టర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్, పిఎబిఆర్, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎపిఐఐసి తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణలో ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని, వేగవంతంగా భూసేకరణ చేపట్టి ఆయా ప్రాజెక్టులను మొదలు పెట్టేలా చూడాలన్నారు. భూ సేకరణలో ఎలాంటి ఆలస్యం జరగరాదని, క్షేత్రస్థాయిలో ఆయా శాఖల అధికారులు పర్యటించి భూసేకరణ ఎంత వరకు వచ్చిందో పరిశీలించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. హెచ్ ఎల్సి, హెచ్ ఎన్ ఎస్ ఎస్, అమరావతి హైవే, భైరవానితిప్ప ప్రాజెక్ట్ తదితర పనులపై ప్రత్యేక దృష్టి సారించి పనులు చేపట్టేలా అధికారులంతా సమన్వయం చేసుకోవాలన్నారు.   పిఎబిఆర్ స్టేజి 1 కింద భూసేకరణ సర్వే పూర్తి చేయాలని,1442 ఎకరాలకు సంబంధించి రిపిటిషన్ ఫైల్ చేయాలన్నారు. ఏప్రిల్ 15 లోపు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చేలా పనులు వేగవంతం చేయాలన్నారు. పిఎబిఆర్ 32వ ప్యాకేజీలో ఈ నెలాఖరులోపు భూసేకరణ చేపట్టాలన్నారు. యాడికి బ్రాంచ్ కెనాల్ కు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేసి నోటిఫికేషన్ ఇచ్చేలా చూడాలన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ కి సంబంధించి భూ సేకరణ పూర్తిచేయాలన్నారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ ఉన్న చోట క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కోసం భూ సేకరణ పనులు వేగవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా రైల్వే పరిధిలోని రాయదుర్గం - తుముకూరు బ్రాడ్ గేజ్ లైన్ కు, ఇతర ప్రాజెక్టు లకు అవసరమైన భూసేకరణ పనులు చేపట్టేలా చూడాలని ఆర్డీవోలకు సూచించారు. ఆర్ అండ్ బి మరియు నేషనల్ హైవే లకు సంబంధించి మైనర్ సమస్యలన్నీ పరిష్కరించి ఈనెల 23 లోపు మరింత పురోగతి కనిపించేలా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా తెలుసుకో..ఎదుగు ( know & rise) లో భాగంగా అనంతపురం లోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎలాంటి విషయాలను తెలుసుకున్నారు, ఏ విషయాలను అబ్జర్వ్ చేశారని జిల్లా కలెక్టర్ విద్యార్థులను అడగగా, వారు సమావేశంపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, సమస్యలు వాటి పరిష్కారాలు గురించి కూలంకషంగా వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ &,రైతు భరోసా) నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ నిషా0తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రవీంద్ర, శ్రీనివాసులు, వరప్రసాద్, ఆర్డీవోలు గుణ భూషణ్ రెడ్డి, మధుసూదన్, వెంకట్ రెడ్డి, రామ్మోహన్, ఏపీ ఐఐసి జెడ్ ఎం పద్మావతి, హెచ్ ఎన్ ఎస్ఎస్ ఎస్ఈ రాజశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.