బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలిద్దాం !
Ens Balu
2
Srikakulam
2021-03-17 18:58:32
శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిర్మూలించేందుకు కృషిచేయాలని ఎం.పి.డి.ఓలకు జిల్లా కలెక్టర్ జె.నివాస్ దిశ నిర్ధేశం చేసారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో చెత్త లేకుండా చూడాలని, సేకరించిన చెత్తను తడిచెత్త ,పొడిచెత్తగా వేరుచెయ్యాలని చెప్పారు. అలాగే పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వేరు చేసి సంబంధిత విభాగాలకు తరలించాలని సూచించారు. చెత్తతో సంపదను ఆర్జించే దిశలో భాగంగా వర్మీకంపోస్ట్ తయారీపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. స్థానిక గ్రామ సర్పంచుల సమన్వయంతో వాలంటీర్లను ఈ కార్యక్రమానికి వినియోగించుకుని చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఆదర్శగ్రామాలు, మోడల్ పంచాయితీలగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమన్వయంతో పనిచేసి ముందడుగు వేయాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగులో ఉన్న పనులను రానున్న 20రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. మెయిన్ రోడ్లను అందంగా తీర్చిదిద్దాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి పరిశుభ్ర వాతావరణాన్ని తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాలలో మల మూత్రాలకు రోడ్లపైకి వెళ్లకుండా అవగాహన కల్పించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరిత గతిన చర్యలు చేపట్టాలని, నిర్వహణ చర్యలు ఖచ్చితంగా ఉండాలని, నిరంతర నీటి సదుపాయం తప్పనిసరిగా కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండటమే కాకుండా వాటిని వినియోగించుకునే దిశగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఇంటి పన్నుల వసూలు చేయడంలో సుమారు 85 % లక్ష్యం సాధించిన శ్రీకాకుళం, రణస్థలం అధికారులను అభినందిస్తూనే,మిగిలిన మండలాల్లో లక్ష్యాలను సాధించలేకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేసారు. లక్ష్యాలు సాధించడంలో అధికారులు నిర్లక్ష్యధోరణి ప్రదర్శించరాదని కలెక్టర్ తెలిపారు. ప్రతీ విద్యుత్ స్తంబాన్ని పరిశీలించి వీధి దీపాలు లేనిచోట తక్షణమే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సంబంధిత అధికారులకు సమాచారం అందచేసి పనులు వేగవంతం పూర్తిచేయాలని అన్నారు. పంచాయితీల్లో అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని, సంబంధిత ఫీజులను వసూలు చేయాలని చెప్పారు. అక్రమ లేఅవుట్ నిర్మాణాలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదుచేయాలని, అటువంటి కట్టడాలకు NOC జారీచేయరాదని తెలిపారు. అక్రమ లేఅవుట్లకు పెర్మిషను ఇస్తే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు,జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇ.ఓ.ఆర్.డిలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.