విజయనగరం మేయర్‌గా వెంపడాపు విజయలక్ష్మి
Ens Balu
3
విజయనగరం
2021-03-18 15:50:25
విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వెంపడాపు విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యుటీ మేయర్‌గా అదే పార్టీకి చెందిన ముచ్చు నాగలక్ష్మిని సభ్యులు ఎన్నుకున్నారు. మేయర్ ఎన్నిక ప్రిసైడింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది. జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే ఈ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక సమావేశం జరిగింది. కార్పొరేషన్‌లో 50 డివిజన్లు ఉండగా, ఎన్నికైన సభ్యులంతా హాజరు కావడంతో, కలెక్టర్ వారిచేత ముందుగా కార్పొరేటర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యింది. 11వ డివిజన్ సభ్యులైన వెంపడాపు విజయలక్ష్మిని మేయర్ అభ్యర్థిగా, 14 డివిజన్ సభ్యులు ఎస్‌వివి రాజేష్ ప్రతిపాదించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని 23వ డివిజన్ సభ్యులు కేదారశెట్టి సీతారామ్మూర్తి బలపరిచారు. మరో ప్రతిపాదన రాకపోవడంతో, విజయలక్ష్మి మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. డిప్యుటీ మేయర్‌గా 1వ డివిజన్ సభ్యులు ముచ్చు నాగలక్ష్మిని, 40 డివిజన్ సభ్యులు బోనెల ధనలక్ష్మి ప్రతిపాదించగా, 42వ డివిజన్ సభ్యులు పిన్నింటి కళావతి బలపరిచారు. మరో అభ్యర్థిత్వం రాకపోవడంతో, డిప్యుటీ మేయర్‌గా నాగలక్ష్మి కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం మేయర్, డిప్యుటీ మేయర్‌లకు ధృవీకరణ పత్రాలను కలెక్టర్ అందజేశారు.
ఈ సమావేశానికి హాజరైన గౌరవ సభ్యులు, ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, కార్పొరేటర్లుగా ఎన్నికైన వారిలో సుమారు 45 మంది కొత్తవారే ఉన్నారని అన్నారు. వారు నిర్వర్తించాల్సిన విధులు, హక్కులు, అభివృద్ది కార్యక్రమాల గురించి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ స్పందిస్తూ, త్వరలో నిపుణులచేత శిక్షణ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం ప్రత్యేక సమావేశాన్ని ముగించారు. సమావేశ నిర్వహణలో అసిస్టెంట్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు, ఇతర మున్సిపల్ అధికారులు, సిబ్బంది సహకరించారు.