బోర్ల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలి..
Ens Balu
4
Visakhapatnam
2021-03-18 16:02:30
భూగర్భ జల మరియు జలగణన శాఖ స్వర్ణోత్సవంలో భాగంగా రైతులు, ప్రజలు బోర్ల నిర్మాణంలో తగు జాగ్రత్తలు పాటించాలని ఆ శాఖ సంచాలకులు ఏ.వరప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోర్ల నిర్మాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. బోర్లలో త్రవ్వకపు బోర్లు, బోరు బావులు అని రెండు రకాల బోర్లు ఉంటాయన్నారు. భూమి పై పొరల్లో నిక్షిప్తమైన భూగర్భ జలాన్ని వెలికి తీయడానికి చేసే నిర్మాణాలను బావులంటారని, బోర్వెల్స్ రావటంతో త్రవ్వకవు బావులు క్రమంగా కనుమరుగవుతున్నా యని చెప్పారు. అలాగే కాస్తంత లోతైన భూపొరల్లో నిక్షిప్తమైన నీటిని వెలికి తీయడానికి నిర్మించే బావులనే బోరుబావులంటారని, సాధారణంగా గట్టి రాతిపొరల్లో వున్న నీటిని వెలికి తీయడానికి ఈ బోరుబావులను నిర్మిస్తారని చెప్పారు. సాధారణంగా మంచినీటి కోసం 4 అంగుళాల వ్యాసంతోను, సాగునీటి కోసం 6 అంగుళాల వ్యాసంతోను వీటి నిర్మాణం చేస్తారని, ఈ బోర్లు అయా రాతిపారలను బట్టి 60 నుండి 120 మీ. లోతు వరకు నిర్మిస్తారని తెలిపారు. పైన వుండే మెతక పొరలను బట్టి 40 నుండి 80 అడుగుల కేసింగు పైపు వేయాల్సి ఉంటుందని, బోరు నిర్మాణానికి 5 నుండి 8 గంటల సమయం పడుతుందని అన్నారు. వీటి ద్వారా గంటకు 4,000 నుండి 15, 000 లీటర్ల నీరు లభ్యమవుతుందని తెలిపారు. రైతులు లేదా ప్రజలు బావి, బోరు నిర్మించుకునే ముందు జియాలజిస్ట్ సలహా తీసుకోవడం మంచిదని, నల్లరేగడి ప్రాంతంలో వృత్తాకారపు బావులు నిర్మిస్తే ఒడ్డు త్వరగా విరిగిపడిపోదని ఆయన సూచించారు. బావికి స్టీనింగు కట్టాలని, తద్వారా పశువులు ప్రమాదవశాత్తు బావిలో పడిపోకుండా ఉంటుందని ఆయన సూచించారు.అలాగే సందులు, పగుళ్ళు ఉన్న రాయి వస్తే బావి అడుగున బోరు వేసుకోవాలని, బోరు చేసేటప్పుడు తేమ లేకుండా పౌడరు లాంటి దుమ్ము వస్తుంటే డ్రిల్లింగు నిలిపివేయాలని పేర్కొన్నారు.బోరులో నీరు పడిన తరువాత లోతు వెళ్ళే కొలది నీరు పెరుగుతుందో లేదో గమనించాలని, లోతుతో పాటు నీరు పెరగకపోతే ఎక్కువ లోతు డ్రిల్లింగు చేయటం అనవసరం అని అన్నారు. బోరు వేసేటప్పుడు వంకర లేకుండా నిట్టనిలువుగా వేసేలా జాగ్రత్త వహించాలని, బోరు సైజు కూడా పైనుండి క్రింది వరకు సమానంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు. అలా కానిపక్షంలో బోరులోనికి మోటారు, పైపులు అమర్చటం కష్టమవుతుందని, బోరు నిర్మించేటప్పుడు లోపలి రాయిలో పగుళ్ళుండి నీటితోపాటు పెద్ద పెద్ద రాయి ముక్కలు బయటకు వస్తుంటే బోరు ఇంకా లోతు వేయించాల్సి ఉంటుందని చెప్పారు. ఇనుప గొట్టాలు చెడిపోతున్న ప్రాంతాలలో పి. వి. సి. కేసింగు పైపు వేసుకోవాలని, మెత్తని రాతిపొర ఉన్నంతవరకు కేసింగ్ పైపు దించుకోవాలని, కేసింగు పైపు దించవలసిన లోతు వరకు ఎక్కువ వ్యాసంతో బోరు నిర్మించాలని అన్నారు. డ్రిల్లింగు చేసే సమయంలో ఎంత పరిమాణంలో నీరు వస్తుందో తెలుసుకోవాలని, ఈ విధంగా లోతుతో పాటు నీరు పెరుగుతుందా లేదా గమనించి బోరు లోతు పెంచాలా వద్దా అనేది నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. బోరు డ్రిల్లింగు అయ్యాక రెండు గంటలు బోరు శుభ్ర పరచేందుకు ప్లషింగ్ చేయించాలని ఆయన తెలిపారు. ఒక ప్రాంతంలో బోరు పడుతుందా లేదా అనేది అనేక అంశాల మీద ఆధారపడి వుంటుందని,. బోర్వెల్ పడుతుందా లేదా అని పరిశీలించే భూగర్భజల శాస్త్రజ్ఞులు ద్వారా ఒక ప్రాంతం లేదా పొలంలో క్షుణ్ణంగా పరిశోధన చేసిన తదుపరి మాత్రమే బావులను నిర్మించుకోవడం మంచిదని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.