25 వరకు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు..


Ens Balu
2
Srikakulam
2021-03-18 16:05:49

శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో విక్రయించని రైతుల వద్ద గల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువును పెంపుదల చేసినట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2020-21 ఖరీఫ్ సీజన్ లో 246 ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అనుసంధానం చేసిన 837 రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించిన సంగతి విదితమే. అందులో భాగంగా జిల్లాలో డిసెంబర్ 2020 నుండి నేటి వరకు 7.52 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 99,159 మంది రైతుల నుండి సేకరించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధరను ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ధాన్యం సేకరణ కార్యక్రమం 2021 ఫిబ్రవరి మాసాంతానికి ముగిసినప్పటికీ, ఇంకనూ రైతుల వద్ద ధాన్యం నిల్వలు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రైతులు నష్టపోరాదనే ఉద్దేశ్యంతో ఈ నెల 25 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి కొనుగోలు చేయుటకు ప్రభుత్వం నిర్ణయించినట్లు జె.సి వివరించారు. కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ఇంకనూ ధాన్యం అమ్మని రైతులు వారి గ్రామానికి దగ్గరలో గల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్ధతు ధరకు విక్రయించుకోవాలని జె.సి ఆ ప్రకటనలో కోరారు.