పంటలకు నీటి నాణ్యత అవసరం..


Ens Balu
2
Srikakulam
2021-03-19 15:20:26

పంటలకు నీటి నాణ్యత పరిశీలించడం అవసరమని భూగర్భ జలం, జల గణన శాఖ ఉపసంచాలకులు సి.ఎస్.రావు అన్నారు. భూగర్భ జలం, జల గణన శాఖ స్వర్ణోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం ఉప సంచాలకుల కార్యాలయంలో శుక్ర వారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. పంట భూములకు నీరు అవసరమని, అదే సమయంలో నీటి నాణ్యత కూడా అంతే అవసరం అన్నారు. నాణ్యత తక్కువగా ఉన్న నీటిని వాడటం వలన నేల పైభాగంలో లవణాలు చేరి పంట దిగుబడులు తగ్గుతాయని ఆయన సూచించారు. పంట భూమి క్రమంగా చవిటి భూమిగా మారిపోతుందని తెలిపారు. సాగునీటి నాణ్యత నాలుగు అంశాలపై ఆధారపడి వుంటుందని పేర్కొంటూ - నీటిలో కరిగివుండే మొత్తం లవణాల పరిమాణం, నీటిలో గల సోడియం ధాతువుకు, ఇతర ధాతువులతో గల నిష్పత్తి, నీటిలో గల జక్కొక్క ధాతువు ఆధిక్యత, కాల్షియం, మెగ్నీషియం ధాతువులతో కలసిపోగా మిగిలిన సోడియం కార్బొనేట్ పరిమాణం పరిశీలించాలని వివరించారు. సాగు చేస్తున్న నేల భౌతిక రసాయన లక్షణాలు, వేయదలచిన పైర్లను కూడ దృష్టిలో పెట్టుకొని నీటి వినియోగాన్ని నిర్ణయించాలని ఆయన సూచించారు. లవణ పరిమాణం ఎక్కువగా వున్న నీటిని వాడితే నేలలు పాలచౌడుగా మారుతాయని చెప్పారు. ప్రత్తి, ఆవాలు, ఉల్లి మొదలగు పంటలు లవణాలను తట్టుకుంటాయని., వరి, చెరకు, పొద్దుతిరుగుడు, జొన్న, మొక్కజొన్న ఇతర సాధారణ పంటలు ఒక మాదిరిగా తట్టుకుంటాయని., అపరాలు, వేరుశెనగ పంటలు, నిమ్మజాతి ఫలవృక్షాలు లవణాలను తట్టుకోలేవని వివరించారు. సోడియం ధాతువుకు కాల్షియం, మెగ్నీషియం ధాతువుల మధ్య గల నిష్పత్తి అధికంగా ఉండే నీటిని, సోడియం కార్బొనేట్ అధికంగా వుండే నీటిని వాడినపుడు నేలలు కారు చౌడుగా మారుతాయని, ఈ నీటిని వినియోగించునపుడు జిప్పం కట్టిన బస్తాలు వేసి ఉంచాలని తద్వారా అందులోని కాల్షియం నెమ్మదిగా కరుగుతుందని చెప్పారు. నీటిలో కాల్షియం ఆధిక్యత పెరుగుతుందని, హానికరమైన సోడియం లవజాల ఉధృతి తగ్గుతుందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పండించే పంటలకు సాధారణంగా వేసే ఎరువుల కన్నా 25 శాతం ఎక్కువ వేయాలని, సేంద్రియ ఎరువులు అధికంగా వాడాలని సూచించారు. ప్రతి సంవత్సరం సాగు నీటిని, నేలను పరీక్షకు పంపి సలహాలు పొందాలని, పరి, ఎనుముగడ్డిలాంటి పైర్లు కారుచౌడును తట్టుకుంటాయని తెలిపారు. భూగర్భ జలాల నాణ్యతను పరిశీలించటానికి హైడ్రాలజీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో వాటర్ క్వాలిటీ లేబరేటరీలను నూతనంగా ఏర్పాటు చేయటం లేదా వున్నవాటిని ఆధునీకరించటం జరిగిందని అన్నారు. పరిశీలక బావులు, హైడ్రాలజీ ప్రాజెక్టు ద్వారా నిర్మించబడిన పీజోమీటర్ల నుండి సేకరించిన నీటి నమూనాలను ఈ లేబరేటరీల ద్వారా విశ్లేషించి వ్యవసాయ నిమిత్తం భూగర్భ జల నాణ్యతను పరిశీలించటం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన 1254 పీజో మీటర్ల నుండి ప్రతి సంవత్సరం వేసవిలోను, వర్షాల అనంతరం నీటి నమూనాలను సేకరించి, వాటి సాగునీటి యోగ్యతను నిర్ధారించటం జరుగుతుందని తెలిపారు. ఈ నమూనాలను అధ్యయనం చేయటం ద్వారా కోస్తా తీరం వెంబడి వున్న మండలాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో భూగర్భ జలం సాగు యోగ్యంగా వున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు.  కోస్తా ప్రాంతంలో కొన్ని మండలాలలో భూగర్భ జలంలో లవణశాతం ఎక్కువగా వుండటంతో అవి సాగుకు అంత యోగ్యంగా లేనట్లు తెలుస్తోందని చెప్పారు. వరి పంట కొంత వరకు లవణ శాతం ఎక్కువగా ఉన్న నీటిని కూడా తట్టుకోగలుగుతుందని మిగిలిన ప్రాంతమంతా స్థానికంగా నీటిలో లవణీయత వున్నప్పటికీ, సాధారణంగా భూగర్భ జలం సాగుయోగ్యంగా వున్నట్లు తెలుస్తోందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో సహాయ సంచాలకులు డి.లక్ష్మణ రావు, ఏపిడి ఏ.లక్ష్మణరావు, ఏ.హెచ్.జి జి.రామారావు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు