సాంకేతిక సమస్యలను అధిగమించాలి..
Ens Balu
4
Vizianagaram
2021-03-19 16:53:40
వైఎస్సార్ చేయూత పథకం అమల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి పురోగతి సాధించాలని జేసీ జె. వెంకటరావు (ఆసరా) డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు పథకాల అమలుపై డీఆర్‌డీఏ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఏసీలు, ఏపీఎంలు ఏపీఆన్‌లైన్‌లో తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన జేసీ పలు సూచనలు చేశారు. వివరాలు పొందుపరచటంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించారు. ఇప్పటి వరకు డీఆర్‌డీఏ, పశుసంవర్ధక శాఖ అధికారులు స్వీకరించిన సుమారు 11వేల దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలని చెప్పారు. బ్యాంకు అధికారులతో మాట్లాడి లబ్ధిదారులకు రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జగనన్న తోడు పథకం అమలుపై లబ్ధిదారులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించటంలో క్షేత్రస్థాయి సిబ్బంది విఫలమయ్యారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇకనుంచైనా బాధ్యతగా వ్యవహరించి తోడు పథకం ద్వారా అందే రూ.10 వేలు రుణం మాత్రమే అని.. తిరిగి చెల్లించాల్సి ఉంటుందని అవగాహన కల్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది చేయించిన రుణాల మంజూరు తదితర అంశాలపై రోజు వారీ నివేదిక తెప్పించుకోవాలని డీఆర్‌డీఏ అధికారులకు సూచించారు. చేయూత, తోడు పథకాల అమల్లో వెనుకబడి ఉన్నామని అందరూ సమన్వయంతో వ్యవహరించి పురోగతి సాధించాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు, ఏపీడీలు సావిత్రి, జయశ్రీ, డీపీఎం మార్టిన్, బంగారమ్మ, పలువురు ఏసీలు, ఏపీఎంలు, పశుసంవర్ధక శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.