ఆర్ధికాభివృద్ధిలో పాడిపరిశ్రమే కీలకం..
Ens Balu
5
Vizianagaram
2021-03-19 16:56:05
విజయనగరం జిల్లా భవిష్యత్తు అంతా పాడిపరిశ్రమపైనే ఆధారపడి వుంటుందని, ఈ రంగానికి బ్యాంకులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పాడిపశువుల కొనుగోలుకు పెద్ద ఎత్తున రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. వచ్చే ఆరు నెలల్లో జిల్లాలో పాడిపరిశ్రమ ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 634 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల ఏర్పాటుకోసం భవనాల నిర్మాణాలకు స్థల సేకరణ పూర్తిచేసి అందజేశామన్నారు. అన్ని గ్రామాల్లో రైతుభరోసా కేంద్రాల పక్కనే ఇవి ఏర్పాటవుతాయన్నారు. వీటి ఏర్పాటుతో బ్యాంకుల్లోనూ కార్యకలాపాలు అధికం అవుతాయని, డిపాజిట్లు కూడా పెరుగుతాయని అందువల్ల బ్యాంకులన్నీ పాడిపరిశ్రమ పట్ల చిన్నచూపు మానుకొని ఇప్పటికైనా పాడిపశువుల కొనుగోలు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. పాడిపరిశ్రమ విషయంలో బ్యాంకులకు సరైన అవగాహన లేకనే ఈ పథకం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయని, రైతులకు పాడిపరిశ్రమ ద్వారా ఎంతగానో సహాయం అందించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో రైతుల ఆదాయాలు పెంచడంలో ఈ పాడిపరిశ్రమ ఎంతగానో తోడ్పడుతుందని, ఏదైనా సమయంలో వ్యవసాయం వల్ల రైతు నష్టపోతే పాడిపశువులే ఆదుకుంటాయన్నారు. అందుకే ఈ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. జిల్లా వ్యవసాయ ఆధారిత ఆర్ధికవ్యవస్థగా రూపొందుతుందని, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి జిల్లాలో అత్యధిక ప్రాధానత్య వుంటుందన్నారు. జిల్లాలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం ప్రోత్సహించేందుకు వాటి మార్కెటింగ్‌కు సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. రైతు వల్లే సమాజం మనుగడ సాగిస్తోందని, మనకు ఆహార భద్రత చేకూరుతుందనే విషయాన్ని బ్యాంకర్లు గుర్తుంచుకొని అటువంటి రైతుల సంక్షేమం, వారి అవసరాల పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించాల్సి వుందన్నారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులతో కూడిన బ్యాంకుల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జగనన్న చేయూత పథకంలో పాడిపశువుల యూనిట్లకు బ్యాంకుల నుండి తగిన సహకారం అందడం లేదని పశుసంవర్థక శాఖ జె.డి. ఎం.వి.ఏ.నర్శింహులు కలెక్టర్‌కు వివరించారు. బ్యాంకులు కోరిన పత్రాలన్నింటినీ అందజేస్తున్నప్పటికీ యూనిట్లు మంజూరు కావడం లేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందిస్తూ లీడ్ బ్యాంకు అధికారి రానున్న రోజుల్లో అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అధికారులతో మాట్లాడి మంజూరైన యూనిట్లు ఏర్పాటయ్యేలా చొరవ చూపాలన్నారు.
జగనన్న తోడు పథకం అమలుపై కూడా కలెక్టర్ సమీక్షించారు. ఈ పథకం అమలులోనూ బ్యాంకర్ల సహకరించాల్సి వుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏయే బ్యాంకులు ఈ పథకం అమలులో వెనుకంజలో ఉన్నాయో గుర్తించి ఏ కారణాలతో దరఖాస్తులు తిరస్కరించారో తెలపాలని బ్యాంకర్లను కలెక్టర్ కోరారు. లబ్దిదారు వారీగా సమీక్షించి అర్హత ఉన్న వారందరికీ రుణాలు ఇవ్వాలని కలెక్టర్ కోరారు. పట్టణ ప్రాంతాల్లోనే ఈ పథకం అమలు కొంత మందకొడిగా సాగుతోందని వెంటనే మునిసిపల్ కమిషనర్లతో సమావేశం ఏర్పాటుచేసి రుణాల మంజూరు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్‌కు కలెక్టర్ సూచించారు.
రిజర్వు బ్యాంకు అధికారి సాయిచరణ్ మాట్లాడుతూ నాబార్డు రూపొందించిన రుణ ప్రణాళిక సమాచారం మేరకు జిల్లాలో చిన్నపరిశ్రమల రంగానికి గత ఏడాది బ్యాంకులు 20శాతం మాత్రమే రుణాలు అందజేయడం పై ప్రశ్నించారు. కోవిడ్ కారణంగా పరిశ్రమల ఏర్పాటుకోసం రుణాలు తీసుకొనేందుకు గత ఏడాది ఎవరూ ముందుకు రాలేదని పలువురు బ్యాంకు అధికారులు వివరించారు.
నాబార్డు రుణ సామర్ధ్య అంచనా ప్రణాళిక విడుదల
నాబార్డు 2021-22 సంవత్సరానికి రూపొందించిన జిల్లా రుణ సామర్ధ్య అంచనా( District Potential Linked Credit Plan 2021-22) ప్రణాళికను జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ విడుదల చేశారు. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు తదితర ప్రాధాన్యత రంగాలకు వచ్చే ఏడాది రూ.6730.53 కోట్ల రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉన్నట్లు ప్రణాళికలో వెల్లడించారు. వ్యవసాయ రంగానికి రుణ ప్రణాళికలో 64 శాతం, చిన్న పరిశ్రమలకు 23శాతం రుణాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.4297.84 కోట్లు, చిన్న పరిశ్రమల రంగానికి రూ.1544.74 కోట్ల రుణాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర అవసరాలకు రూ.887.98 కోట్ల రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రణాళికలో తెలిపారు.
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది రూ.2652 కోట్ల లక్ష్యానికి గాను రూ.2038 కోట్ల పంటరుణాలు అందజేశామని, వ్యవసాయ టెర్మ్ రుణాలు రూ.680 కోట్లు ఇవ్వాల్సి ఉండగా లక్ష్యానికి మించి రూ.720 కోట్లు అందజేశామన్నారు.
నాబార్డు ఏ.జి.ఎం. పి.హరీష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగ నిపుణులు, బ్యాంకర్లు తదితర అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే రుణ సామర్ధ్య అంచనా ప్రణాళిక రూపొందించామన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్, వ్యవసాయ శాఖ జె.డి. ఆశాదేవి, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరక్టర్ సుబ్బారావు, పశుసంవర్ధక శాఖ జె.డి. నర్శింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా అధికారులు, బ్యాంకుల జిల్లాస్థాయి కంట్రోలింగ్ అధికారులు పాల్గొన్నారు.