పరిశ్రమలు వేసవి జాగ్రత్తలు పాటించాలి..
Ens Balu
2
East Godavari
2021-03-19 19:14:17
వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు దృష్ట్యా పరిశ్రమల్లో అదనపు జాగ్రత్తలు తీసుకునేలా పారిశ్రామిక యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధికారులకు సూచించారు. తాగునీరు, ప్రాథమిక చికిత్స వంటి ఏర్పాట్లు చేసేలా చూడాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పారిశ్రామిక ప్రమాదాలు జరక్కుండా అవసరమైన భద్రతా చర్యలు తీసుకునేలా మార్గనిర్దేశనం చేయాలని ఆదేశించారు. శుక్రవారం కాకినాడలోని కలెక్టరేట్ నుంచి వర్చువల్ విధానంలో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015-20) కింద సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్ఎంఈ) యూనిట్లకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్నామని, తాజాగా 21 దరఖాస్తులకు సంబంధించి రూ.84,90,650 మేర మంజూరుకు డీఐఈపీసీ సిఫార్సు చేసినట్లు తెలిపారు. పారిశ్రామిక యూనిట్లకు ప్రోత్సాహకాలు అందించేందుకు 2021, ఫిబ్రవరి 25, మార్చి 18న స్క్రుటినీ వెరిఫికేషన్ కమిటీ (ఎస్‌వీసీ) సమావేశాలు జరిగినట్లు తెలిపారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందిన పారిశ్రామిక యూనిట్ల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన సలహాలు అందించాలని దీనివల్ల ఆయా యూనిట్లు లాభాల బాట పట్టేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. ఏపీ సింగిల్ డెస్క్ పాలసీ కింద అనుమతులు పొందేందుకు 2021, ఫిబ్రవరి 12 నుంచి మార్చి 18 వరకు 57 దరఖాస్తులు అందాయని తెలిపారు. వీటిలో 29 దరఖాస్తులు ఇప్పటికే ఆమోదం పొందాయని.. మిగిలిన 28 దరఖాస్తులను కూడా నిర్దేశ గడువు (ఎస్ఎల్ఏ)లోనే పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. పీఎంఈజీపీ పథకం కింద ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పేపర్, జ్యూట్ ఆధారిత ఉత్పత్తుల తయారీకి వచ్చిన 23 దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించి, బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిస్తూ నిధులు కేటాయిస్తోందని, దీన్ని పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూడా ఓ మార్గంగా ఉపయోగించుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. లేఅవుట్లలోనే ఇటుకలు వంటి నిర్మాణ సామగ్రి తయారీ యూనిట్లు ప్రారంభించేలా ఔత్సాహికులను ప్రోత్సహించాలని, వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అందించాలని సూచించారు. దీనివల్ల తక్కువ ధరకు నాణ్యమైన సామగ్రి అందుబాటులోకి రావడంతో ఇళ్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, అదే విధంగా అధిక డిమాండ్ కారణంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం ఉంటుందన్నారు. సమావేశంలో డీఐసీ జనరల్ మేనేజర్ బి.శ్రీనివాసరావు, బీఐఎస్ (విశాఖపట్నం) సైంటిస్ట్ సంధ్య, కాయిర్‌బోర్డ్ రీజనరల్ ఆఫీస్ ఇన్‌ఛార్జ్ కె.దశరథరావు, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.